నర్సంపేట, జూలై 14 : ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల మధ్య నెలకొన్న కొట్లాటతో అభివృద్ధి శూన్యంగా మారిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం నర్సంపేటలోని నెక్కొండ రోడ్డులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్ది మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు కోరుకున్న అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాధాన్యతను ఎమ్మెల్యేలు తగ్గించారన్నారు.
సొంత కాంట్రాక్టు పనుల కోసం పాతవి రద్దు చేసి వాటినే కొత్తగా మంజూరు చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు చేసిన అభివృద్ధి పనులను కోరి తెచ్చుకున్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రద్దు చేస్తున్నారని చెప్పారు. లీగల్‌గా అగ్రిమెంట్ చేసుకున్న పనులను ఎందుకు రద్దు చేస్తున్నారో చెప్పాలన్నారు.
మార్పు అంటే పాత పనులను రద్దు చేసి సొంత కాంట్రాక్టు కంపెనీకి అగ్రిమెంట్ చేయడమేనా? అని ప్రశ్నించారు. చాతకాక పనులను రద్దు చేయమని అధికారులపై ఒత్తిడి తేవడం అవివేకమన్నారు. రైతులు ఎరువుల కోసం చెప్పులను లైన్లో పెట్టే పరిస్థితి నెలకొందని, యూరియా నిల్వలపై సమీక్షలు జరపలేదన్నారు. నర్సంపేట డివిజన్లో మట్టి దందాలో రెవెన్యూ అధికారులూ వాటాదారులేనని, రానున్న స్థానిక ఎన్నికల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే అడ్డుకున్న, రద్దు చేసిన పనులను, కాంగ్రెస్ నాయకుల అరాచకాలను ప్రజలకు వివరిస్తామన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పేరిట కాంగ్రెస్ నాయకులు ముఠాగా ఏర్పడి వసూళ్లకు పాల్పడుతున్నారని పెద్ది మండిపడ్డారు. సమావేశంలో జిల్లా నాయకుడు రాయిడి రవీందర్‌రెడ్డి, నర్సంపేట మండలాధ్యక్షుడు నామాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, క్లస్టర్ ఇన్చార్జిలు మోతె పద్మనాభరెడ్డి, కోమాండ్ల గోపాల్‌రెడ్డి, కొడారి రవన్న, మోటూరి రవి, వల్లాల కరుణాకర్‌గౌడ్, అల్లి రవికుమార్, భూక్యా వీరునాయక్, కడారి కుమారస్వామి, తూటి శ్రీనివాస్, దేవోజు సదానందం, భూక్యా వీరన్న తదితరులు పాల్గొన్నారు.