బచ్చన్నపేట, జనవరి 21: కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలపై చిన్నచూపు చూస్తున్నదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని కొన్నె లో బీఆర్ఎస్ నేత, సామాజిక సేవా కార్యకర్త కోడూరి శివకుమార్‌గౌడ్ గ్రామస్తులకు వెయ్యి వాటర్ క్యాన్లను ఇవ్వాలని నిర్ణయించుకోగా వాటిని ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా శివకుమార్‌ను అభినందించా రు. అనంతరం పల్లా మాట్లాడుతూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇదే సమయంలో చెరువులన్నీ జలకళతో ఉట్టిపడ్డాయని, నేడు ఎండిపోయి వెక్కిరిస్తున్నాయని అన్నారు.
గోదావరి నీళ్లు పుష్కలంగా ఉన్నా కరువు ప్రాంతమైన బచ్చన్నపేట మండలానికి తరలించడం లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతి నియోజకవర్గానికి రూ.5కోట్లు కేటాయిస్తే, నేడు ఒక్క పైసా మంజూరు కాలేదన్నారు. అసెంబ్లీలో అడిగితే ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పిందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినందున చెరువులు నింపడం లేదని, విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. రోడ్ల కోసం సంబంధిత మంత్రి వద్దకు వెళ్లి నిధులు తీసుకొచ్చేలా కృషి చేస్తామన్నారు.
సీఎం అంటే అందరూ నా వాళ్లు అనుకోవాలే తప్ప, పార్టీల పేరుతో పక్కన పెట్టడం సబబు కాదన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, నాయకులు బావండ్ల కృష్ణంరాజు, సిద్దిరాములు, వేముల విద్యాసాగర్‌గౌడ్, రామాంజనేయులు, ముశిని రాజుగౌడ్, దూడల కనుకయ్యగౌడ్, వేముల లక్ష్మణ్‌గౌడ్, కొప్పురపు సిద్ధారెడ్డి, బాల్‌రెడ్డి, మల్లారెడ్డి, అంబాల క్రాంతికుమార్, ఎంటె శ్రీనివాస్, చెవిటి శ్రీకాంత్, ఇటికాల అభిన య్, తేలు శ్రీనివాస్, పిట్టల శివకుమార్, కిషన్, స్వామి, యాట రామచంద్రయ్య పాల్గొన్నారు.