హనుమకొండ, సెప్టెంబర్ 18: చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో ఈనెల 21వ తేదీన బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుందని, 22 నుంచి అక్టోబర్ 2 వరకు రుద్రేశ్వరీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన ఉత్సవ సమితి అధ్యక్షుడు బత్తిని శ్రీనివాసరావు, ఆలయ ఈవో డి.అనిల్‌కుమార్, ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, ఉత్సవ సమితి కార్యదర్శి కోన శ్రీకర్, టిరెడ్డి రవీందర్‌రెడ్డి, సమితి సభ్యులు పులి రజినీకాంత్, రావుల ధనుంజయతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేయిస్తంభాల దేవాలయ ప్రాంగణంలో విద్యుత్ అలంకరణ, పారిశుద్ధ్య ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసాదవితరణలు, అన్నదాన కార్యమాలు నిర్వహిస్తున్నట్లు, 9 రోజులపాటు ప్రజలక్షేమం కోసం, ఆయురారోగ్యాలతో ఉండాలని లోకకళ్యాణార్థం ప్రతిరోజు చండీహోమం కార్యక్రమాలు వేదపండితుల ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక మంటపం ఏర్పాటు చేసి రుద్రేశ్వరీదేవి ఉత్సవ విగ్రహం ప్రతిష్టించి ప్రతిరోజు అమ్మవారికి అలంకారాలు ఏర్పాటు చేశామని, రాజకీయాలకతీతంగా ఈ ఉత్సవం నిర్వహిస్తున్నామని, భక్తులు అమ్మవారిని దర్శించుకొని తరలించాలని ఎమ్మెల్యే చెప్పారు.
ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ దేవీనవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు, సీఎంఆర్ షాపింగ్‌మాల్ ఆధ్వర్యంలో ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. దేవాదాయ-ధర్మాదాయ శాఖపక్షాన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మంచినీటి సౌకర్యం, భక్తులు ఆడే బతుకమ్మ పండుగకు పారిశుద్ధ్యం ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈవో అనిల్‌కుమార్ తెలిపారు.