వేలేరు, జూన్ 06 : అర్హులైన లబ్ధిదారులు తమ శక్తి మేరకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచించారు. శుక్రవారం వేలేరు మండల కేంద్రంలోని రైతువేదికలో జరిగిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం పాల్గొని లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 400 నుండి 600లోపు చదరపు అడుగుల మధ్యలోనే ఇండ్లు నిర్మించుకోవాలని సూచించారు. అప్పులు చేసి పెద్దగా ఇళ్లు నిర్మించుకుంటే ఇబ్బందులు పడతారని తెలిపారు. అర్హులైన పేదలకు రెండవ విడత మళ్లీ ఇండ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
బిల్లుల కోసం ఎవరికి ఒక్క రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎవరైనా బిల్లులు ఇప్పిస్తామని డబ్బులు ఆడిగేతే తనకు చెప్పాలని అన్నారు. వేలేరు మండలంలో శాలపల్లి గ్రామం పైలట్ గ్రామంగా ఎంపిక కాగా శాలపల్లిలో 79 ఇండ్లు ప్రారంభ దశలో ఉన్నాయి. మిగతా గ్రామాలకు 196 ఇండ్లు మంజూరు కాగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకట్రెడ్డి, ఎంపీడీవో లక్ష్మీప్రసన్న, తహశీల్దార్ కొమి, ఎంపీవో భాస్కర్, డీఈ చైతన్య, నాయకులు సంపత్, యాదగిరి మల్లిఖార్జున్, సద్దాంహుస్సెన్ తదితరులు పాల్గొన్నారు.