వరంగల్, జూలై 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ; సీఎం రేవంత్‌రెడ్డికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి మధ్య అంతరం పెరిగినట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మంత్రి పదవుల కేటాయింపులో తనకు అవకాశం దక్కకపోవడం, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై గుర్రుగా ఉన్న ఆయన ముఖ్యమంత్రికి దూరంగా ఉంటున్నారు. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచే అంటీముట్టన్నట్లు వ్యవహరిస్తున్న దొంతి ఇటీవల వరంగల్ పర్యటనకు వచ్చిన సమయంలోనూ కలవకపోవడం, సమీక్షా సమావేశానికి హాజరుకాకపోవడంతో ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగిందనేందుకు బలం చేకూరుస్తున్నది. 2023లో రేవంత్ జోడో యాత్రను నర్సంపేట నియోజకవర్గంలో నిర్వహించొద్దని తేల్చి చెప్పిన విషయం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంటున్నది. త్వరలో జరుగబోయే మంత్రివర్గ విస్తరణ తర్వాత దొంతి రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ జరుగుతున్నది.
సీఎం రేవంత్‌రెడ్డిపై సొంత పార్టీ ఎమ్మెల్యేల్లోనే అ సంతృప్తి పెరుగుతున్నది. రేవంత్‌రెడ్డి కంటే ముందు నుంచీ కాంగ్రెస్‌లో ఉన్న సీనియర్లలో ఇది ఎక్కువగా కనిపిస్తున్నది. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సీఎంపై అసంతృప్తితో ఉంటున్నారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన దొంతి ఇటీవల వరంగల్‌కు వచ్చిన ముఖ్యమంత్రిని కలవలేదు. సీఎం నిర్వహించిన సమావేశంలోనూ పాల్గొనలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మంత్రి పదవుల కేటాయింపులో రేవంత్‌రెడ్డిపై అసంతృప్తిగా ఉన్న మాధవరెడ్డి అదే వైఖరిని కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని, కొత్తగా వచ్చిన వారికి కీలక పదవులు ఇచ్చారని అసంతృపితో ఉన్నారు. మంత్రుల ప్రమాణస్వీకారం జరిగి ఏడు నెలలు కావస్తున్నా సీఎంపై మాధవరెడ్డి అదే వైఖరితో ఉన్నట్లు రేవంత్ వరంగల్ పర్యటనతో మరోసారి స్పష్టమైంది. రాష్ట్ర మంత్రివర్గంలో ఖాళీ గా ఉన్న స్థానాల్లో అయినా తనకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్‌తో మాధవరెడ్డి ఉన్నారు.
మాధవరెడ్డికి, రేవంత్‌రెడ్డికి మధ్య దూరం ఎప్పటి నుంచో ఉన్నది. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దొంతి దూరంగానే ఉంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ ముఖ్యమంత్రి అయినా మాధవరెడ్డి ఇలాగే వ్యహరిస్తున్నారు. ఇప్పటి వరకు రేవంత్‌రెడ్డిని ఒక్కసారి కూడా దొంతి కలవలేదని తెలిసింది. కాంగ్రెస్ బలోపేతం కోసం ఆ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్‌గాంధీ దేశ వ్యాప్తంగా జోడో యాత్ర నిర్వహించారు. రాహుల్ యాత్ర స్ఫూర్తితో రాష్ట్రంలో కాంగ్రెస్‌లో ఆధిపత్యం కోసం పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి 2023 ఫిబ్రవరిలో తెలంగాణలోని ప్రతి లోక్‌సభ సెగ్మెంట్లో ‘హాత్ సే హాత్ జోడో యాత్ర’ పేరుతో రాజకీయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ములుగు నియోజకవర్గంలోని మేడారంలో ఈ యాత్ర మొదలైంది. ములుగు తర్వాత ఈ సెగ్మెంట్‌కు ఆనుకుని ఉన్న నర్సంపేటలోనూ జోడో యాత్ర జరిగేలా రేవంత్‌రెడ్డి రూట్‌మ్యాప్ సిద్ధం చేసుకున్నారు.
యాత్రతో ఉపయోగం లేదనే కారణంతో అప్పట్లో దొంతి నర్సంపేట సెగ్మెంట్లో రేవంత్‌రెడ్డి యాత్ర వద్దని తేల్చి చెప్పారు. దీంతో రేవంత్‌రెడ్డి తన యాత్రను మహబూబాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు మార్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ తీరుపై అసంతృప్తితో ఉన్న దొంతి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దూరంగానే ఉంటున్నారు. 2014 ఎన్నికల సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న దొంతికి ఆ పార్టీ టికెట్ ఇవ్వలేదు. మాధవరెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. 2023 ఎన్నికల్లో గెలిచారు. కాంగ్రెస్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన తాను ఆ పార్టీలో చేరానని, రేవంత్‌రెడ్డి మాత్రం కొత్తగా పార్టీలోకి వచ్చిన సీతక్క, కొండా సురేఖకు మంత్రి పదవులు ఇచ్చారని అసంతృప్తితో ఉన్నారు. జూన్ 29న పర్యటనకు వచ్చిన సీఎం కార్యక్రమాలకు, అభివృద్ధిపై సమీక్షకు దూరంగా ఉండడంతో దొంతి మాధవరెడ్డి రాజకీయంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటారా? అనే చర్చ జరుగుతున్నది.