పరకాల, జూలై 20 : రైతులకు ఉచిత విద్యుత్ వద్దన్న రేవంత్ రైతు వ్యతిరేకి అని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు రేవంత్‌కు కర్రు కాల్చి వాత పెట్టాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మండలంలోని కామారెడ్డిపల్లి, నాగా రం, పరకాల పట్టణంలోని రైతు వేదిక భవనాల్లో గురువారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం నాగారం గ్రామంలో కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా మాట్లాడుతూ రైతును రాజు చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, అమలు చేస్తుంటే రైతులపై, రైతు సంక్షేమ పథకాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వేషంతో మాట్లాడడం హేయమైన చర్య అన్నారు. రైతుల సంక్షేమ కోసం ఏనాడు ఆలోచించని కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతు సంక్షేమ పథకాలపై తమ అనైతిక బుద్ధిని వెల్లడిస్తూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో వ్యవసాయం దండగగా మారిందన్నారు. మళ్లీ వ్యవసాయాన్ని దండుగగా మార్చేందుకు కాంగ్రెస్ నాయకులు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ఆకలి గోసలు, రైతు ఆత్మహత్యలు, ఉపాధి వలసలు ఉండేవని, కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాడి పంటలతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. గతంలో ఆకలి తీర్చుకునేందుకు వలసలు వెళ్లిన వారు తిరిగి గ్రామాలబాట పట్టారన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, రాష్ట్రంలో ప్రజలు మరోసారి సీఎం కేసీఆర్ పాలనలను కోరుకుంటున్నారన్నారు. కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రజల సంతోషాన్ని ఓర్వలేని కాంగ్రెస్ కుట్రలు చేస్తోందన్నారు. ఆ కుట్రలను రాష్ట్రప్రజలు తిప్పి కొట్టాలని సూచించారు.
రాష్ట్రంలో మూడు పంటలు పండేందుకు నిరంతర నాణ్యమైన విద్యుత్‌ను ఇచ్చే సీఎం కేసీఆర్ కావాలో, మూడు గంటల కరెంటు చాలు అనే కాంగ్రెస్ కావాలో ప్రజలు ఆలోచించాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తే వ్యవసాయం దండుగై మళ్లీ వలసలు పెరుగుతాయని, వ్యవసాయాన్ని పండుగ చేసిన కేసీఆర్ వస్తే ప్రజలే పాలకులుగా మారుతారని అన్నారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ బొల్లె భిక్షపతి, ఏఎంసీ చైర్మన్ బండి సారంగపాణి, జడ్పీటీసీ మొగిలి, వైస్ ఎంపీపీ చింతిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నల్లెల్ల లింగమూర్తి, మున్సిపల్ వైస్‌చైర్మన్ రేగూరి విజయపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మడికొండ శ్రీను, దళిత బంధు పట్టణ కన్వీనర్ సోదా రామకృష్ణ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.