కాంగ్రెస్‌లో విచిత్ర పరిస్థితులు కనిపిస్తున్నాయి. రేవంత్‌రెడ్డి సర్కారు కొలువుదీరి పట్టుమని పది నెలలు కూడా కాకముందే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలకు పొసగక వ్యతిరేక పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా ఇద్దరు మంత్రులతో సఖ్యత లోపించి దూరం దూరంగా ఉంటూ ఏ ప్రభుత్వ అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు పిలువడం లేదు. ఒకవేళ అమాత్యులు పర్యటనలకు వచ్చేందుకు ప్రయత్నించినా అడ్డంకులు సృష్టిస్తూ వ్యూహాలు పన్నుతున్నట్లు స్పష్టమవుతోంది. అదీగాక పార్టీ కార్యక్రమాల్లోనూ ఎవరికి వారే అన్నట్లు ఉంటున్నారు.
ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మాత్రం తప్పదన్నట్లు అందరూ ఒకచోట కనిపిస్తున్నా మిగతా సమయాల్లో మంత్రులను అస్సలు పట్టించుకోవడం లేదు. ఒక్కోసారి వీరిద్దరూ కాదని ఇన్చార్జి మంత్రి పర్యటించడమూ ఇందుకు బలం చేకూర్చుతున్నది. ఇలా ఒకటీరెండు చోట్ల మాత్రమే కాదు.. ఉమ్మడి జిల్లాలోని అన్ని సెగ్మెంట్లలోనూ మంత్రులను పట్టించుకోకుండా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు పార్టీ ఉనికిని ప్రమాదంలో పడేసేలా ఉన్నదనే చర్చ జరుగుతోంది.
– వరంగల్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఉమ్మడి వరంగల్ నుంచి కొండా సురేఖ, సీతక్కకు మంత్రి పదవులు దక్కాయి. ఉమ్మడి జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నియమితులయ్యారు. అయితే పది నెలలు గడుస్తున్నా ఇప్పటికీ మంత్రులు అధికారికంగా పర్యటించని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. హనుమకొండ కలెక్టరేట్లో జరిగే ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశాలు మినహా మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి ఒక్క కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. పార్టీ కార్యక్రమాల గురించి ఇక చెప్పనక్కర్లేదు. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మంత్రులను మాటమాత్రంగా అయినా పిలువడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటించినప్పుడు తప్ప అభివృద్ధి పనుల్లో మంత్రులతో ఎమ్మెల్యేల తీరు అంతంత మాత్రంగానే ఉండడంతో.. ఆయా శాఖల నుంచి కొత్త పనులకు నిధుల విషయంలో ఎమ్మెల్యేల ప్రతిపాదనలకు మంత్రులు ఆమోదం తెలుపడం లేదు.