హనుమకొండ/కరీమాబాద్, జూలై 28: వరద బాధితులను అన్ని విధాలా ఆదుకున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఏటూరునాగారం-కొండాయి, భద్రాచలం ప్రాంత వరదల్లో చిక్కుకున్న బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఆహారం, మందులను శుక్రవారం మామునూరులోని ఎయిర్‌పోర్టులో ప్యాక్ చేసి హెలీకాప్టర్ల ద్వారా పంపారు. దీన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, వరంగల్ కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి మంత్రి ఎర్రబెల్లి స్వయంగా పరిశీలించారు. ఆతర్వాత హనుమకొండ పరిమళకాలనీ, జవహర్ నగర్‌లోని ముంపు ప్రాంతాలను వారు హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్‌తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ అతి భారీ వర్షాలతో నష్టం జరిగిందన్నారు. వరదల్లో చిక్కుకున్న బాధితులను కాపాడేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని, బాధితులకు మామునూరు నుంచి హెలీకాప్టర్ ద్వారా ఆహారం, మందులు పంపినట్లు తెలిపారు. వర్షాలు భారీగా కురుస్తున్న సమయంలో సకాలంలో స్పందించి, సహాయక చర్యలు చేపట్టి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. హెలికాప్టర్లు, రెస్యూటీమ్‌లు, పడవలు, ఎమ్మెల్యేలు, అధికారులు, సిబ్బంది రాత్రీ పగలు తేడా లేకుండా కష్టపడి, లోతట్టు ప్రాంతాల నుంచి వేలాది మందిని పునరావాస కేంద్రాలకు చేర్చి ఆహార పొట్లాలు, తాగునీరు, మందులు అందించినట్లు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తుందని, వరదల్లో చిక్కుకున్న బాధితులందరినీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రాంతాలకు తరలించడంతోపాటు అన్ని విధాలా ధైర్యం కల్పించామని పేర్కొన్నారు.
పరిస్థితిని సీఎం కేసీఆర్ నిరంతరం సమీక్షిస్తున్నారని చెప్పారు. గతంలో వరదలు వచ్చినప్పుడు చేపట్టిన శాశ్వత వరద నివారణ చర్యల వల్లే చాలా వరకు ఇబ్బంది తగ్గిందని, మరికొన్ని పనులు ప్రగతిలో ఉన్నాయని, వాటిని కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు. అతి భారీ వర్షాల వల్లే ఈ అనర్థాలు వచ్చాయని చెప్పారు. ప్రజలు మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అలాగే వరదలు తగ్గి, పూర్వ స్థితికి వచ్చే వరకు అధికారులు, సిబ్బంది విశ్రమించొద్దన్నారు. అప్పటివరకు సహాయక చర్యలు, పునరావాస కేంద్రాలు కొనసాగుతాయని చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, సీఎస్ ఎప్పటికప్పుడు సహాయ పునరావాస చర్యలపై సమీక్షిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.