Anil Ravipudi | శివాజీ, లయ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ కామెడీ చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ విడుదలకు సిద్ధమైంది. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 12న నేరుగా ఈటీవీ విన్ ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్‌కు ముందుగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడిన మాటలు ఆకట్టుకున్నాయి. గతంలో ‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ చేసిన వ్యాఖ్యలు ఎంతటి వివాదానికి దారి తీసాయో అందరికీ తెలిసిందే. హీరోయిన్ల దుస్తులపై ఆయన చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయగా, మహిళా కమిషన్ ముందు కూడా వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
అదే విషయాన్ని సరదాగా ప్రస్తావించిన అనిల్ రావిపూడి, “ఈసారి జాగ్రత్తగా మాట్లాడతానని శివాజీ అన్నాడు” అంటూ నవ్వులు పూయించారు. ట్రైలర్‌పై అనిల్ ప్రశంసలు కురిపిస్తూ, సినిమా రైటింగ్, ప్రెజెంటేషన్, ఎడిటింగ్ అన్ని అద్భుతంగా ఉన్నాయని అన్నారు. ట్రైలర్ చూసిన వెంటనే ఫిబ్రవరి 12న ఈటీవీ విన్లో సినిమా చూడాలనిపించిందని, అదే ఈ చిత్ర విజయానికి సంకేతమని పేర్కొన్నారు. దర్శకుడు సుధీర్ శ్రీరామ్ ప్రతిభావంతుడని, భవిష్యత్తులో థియేటర్ రిలీజ్ సినిమాలు కూడా చేయాలని ఆకాంక్షించారు. ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ గురించి కూడా అనిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యే కంటెంట్‌ను అందిస్తూ ఈటీవీ విన్ వేగంగా ఎదుగుతోందని, ‘90స్’ వెబ్ సిరీస్ తనకు ఎంతో నచ్చిందని తెలిపారు. ఆ సిరీస్ నుంచే శివాజీకి కొత్త ఇన్నింగ్స్ ప్రారంభమైందని, ప్రస్తుతం ఆయన వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటం సంతోషకరమన్నారు.
తాను హీరోగా నటించే ఆలోచనలపై కూడా అనిల్ క్లారిటీ ఇచ్చారు. “నన్ను నేను హీరోగా చూసుకోవాలనే ఉద్దేశ్యం లేదు. నా సినిమాల్లో హీరోలనే సూపర్ స్టార్స్‌లా చూపించడమే నాకు ఇష్టం” అని స్పష్టం చేశారు. హీరోయిన్ లయ గురించి మాట్లాడుతూ, ఆమె ప్రతిభను ప్రశంసిస్తూ, ఈ సినిమాలో ఆమె పాత్ర పూర్తిగా భిన్నంగా ఉందని, ట్రైలర్లో ఆమె యాక్షన్ సీన్స్ చూసి ఆశ్చర్యపోయానన్నారు. మొత్తానికి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సరదా వ్యాఖ్యలు, ఆసక్తికర చర్చలతో సందడిగా సాగగా, ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.