హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): ప్రజలు హైడ్రా పేరు వింటేనే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయని రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది. రెవెన్యూ, ఇరిగేషన్ వంటి కీలక శాఖలు నిర్వీర్యం అయ్యాయని, చివరికి పోలీసులు సైతం హైడ్రాకు వినతిపత్రాలు ఇస్తున్నారని విస్మయం వ్యక్తంచేసింది. ఒక వ్యక్తికి ఇంతటి అసాధారణ అధికారాలు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖల చట్టాలను రద్దు చేసి, అన్ని ప్రభుత్వ శాఖలను మూసివేసి, ‘హైడ్రా’ అనే ఒకే ఒక చట్టం అమలు చేస్తే సరిపోతుందని ధర్మాసనం తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. మేడ్చల్ -మలాజిగిరి జిల్లా మలాజిగిరి మండలం లోతుకుంట గ్రామం సర్వే నంబర్ 1, 2 లోని 40 ఎకరాల భూమిలో హైడ్రా కూల్చివేతలపై శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ దాఖలు చేసిన కోర్టు ధికరణ కేసులో శుక్రవారం విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ మరోసారి హైడ్రాపై నిప్పులు చెరిగారు.
ఒకే కేసులో ఏకంగా మూడు కోర్టు ధికరణ పిటిషన్లు దాఖలైనా, హైకోర్టు ఒకదాని తర్వాత మరొక ఉత్తర్వులు జారీచేసినా హైడ్రా పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా పరిగణించారు. శుక్రవారం దాఖలు చేసిన అఫిడవిట్లో కనీసం ఒక్కసారైనా క్షమాపణ కోరకపోవడం విస్మయాన్ని కలిగించిందని పేర్కొన్నారు. సాధారణంగా కోర్టు ధిక్కరణ కేసుల్లో బేషరతు క్షమాపణలు చెప్పడం న్యాయ ప్రక్రియలో జరుగుతుందని, కానీ హైడ్రా దానికి అతీతమన్నట్టుగా వ్యవహరిస్తున్నదని ఆక్షేపించారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు బేషరతుగా క్షమాపణ కోరుతూ సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టంచేశారు. ఇకపై వివాదాస్పద స్థలంలోకి హైడ్రా ప్రవేశించదని స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆదేశించారు. ఈ నెల 18న ఏ కారణాలతో పిటిషనర్‌కు చెందిన స్థలంలోకి ప్రవేశించాల్సి వచ్చిందో పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. కేవలం అడ్వొకేట్ జనరల్ వచ్చి కోరినందునే మిలిటరీ యాక్షన్ తీసుకోవాలన్న తమ ఉత్తర్వులను నిలిపివేస్తున్నామని చెప్పారు.
ఇతర చట్టాలను రద్దు చేయండి
విచారణ సందర్భంగా హైడ్రా అధికార పరిధిపై న్యాయమూర్తి పలు ప్రశ్నలు సంధించి ఉకిరిబికిరి చేశారు. హైడ్రాకు కల్పించిన అసాధారణ అధికారాలను చూస్తుంటే తనకు మాటలు చాలడం లేదని వ్యాఖ్యానించారు. ఒక ప్రభుత్వ జీవోతో ఏర్పాటైన సంస్థ అన్ని శాఖలకు చట్టబద్ధంగా వచ్చిన అధికారాలను బైపాస్ చేసి, పెత్తనం చెలాయిస్తున్నదని ఆక్షేపించారు. రెవెన్యూ చట్టంలోని 6, 7 సెక్షన్ల ప్రకారం భూ ఆక్రమణలపై చర్యలు తీసుకొనే స్పష్టమైన అధికారాలు రెవెన్యూ శాఖకు ఉన్నాయని స్పష్టంచేశారు. అలాంటప్పుడు ఆయన (హైడ్రా కమిషనర్) అక్కడేం చేస్తున్నారని నిలదీశారు. ‘ఆయనే ఒక చట్టమా? రెవెన్యూ శాఖ, ఇరిగేషన్ శాఖ.. ఇలా ప్రతి ఒక్కరూ ఆయన దగ్గరికే వెళ్తున్నారు. ఎందుకు?’ అని ప్రశ్నించారు. చివరికి పోలీసులు కూడా హైడ్రాను ఆశ్రయించే దుస్థితి ఎందుకు వచ్చిందని, ఈ పరిస్థితిని ఎవరు కల్పించారని ప్రశ్నించారు. ప్రభుత్వ చట్టాలతో పని లేకుండా హైడ్రానే అన్నీ చేస్తుంది.. చేయాలి.. అనుకుంటే మిగిలిన అన్నీ ప్రభుత్వ శాఖలు ఎందుకని, ఆయా చట్టాలను రద్దు చేసి, హైడ్రానే ఒక చట్టంగా చేస్తే సరిపోతుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. భూమికి రక్షణ కల్పించాలని కోరుతూ రక్షణ శాఖ అధికారులు తమకు వినతిపత్రం అందించారని హైడ్రా చేసిన వాదనను న్యాయమూర్తి తీవ్రంగా తప్పుబట్టారు.
అన్ని వాహనాలు ఎలా వస్తున్నాయి?
‘సేవ్ ద రాక్స్’ అనే ఒక గుర్తింపు లేని ఒక సంస్థ వినతిపత్రం ఇచ్చిందనే కారణంతో హైడ్రా కమిషనర్ వివాదాస్పద స్థలంలోకి వెళ్లడాన్ని న్యాయమూర్తి తప్పుబట్టారు. ‘ఇప్పుడు మరో శాఖ నుంచి ఇంకో లెటర్ సృష్టించి మరోసారి వెళ్తారు. ఇలాగే ప్రతిచోటికి ఆయన వెళ్తారా?’ అని ప్రశ్నించారు. అసలు ఆయన పోలీసులను ఎందుకు తీసుకెళ్తున్నారని, ఆయనకు ఆ అధికారం ఎవరిచ్చారని నిలదీశారు. ఆయన ఎక్కడికి వెళ్లినా పదికిపైగా వాహనాల్లో ఎలా వెళ్తున్నారని, జేసీబీలు, వాహనాలు వంటివి ఎక్కడి నుంచి వస్తున్నాయని, జీవో- 99 ప్రకారం ఆయనకు ఇచ్చిన సౌకర్యాలు ఏమిటని ప్రశ్నించారు. ప్రజల మనసుల్లో భయాన్ని సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. హైడ్రా చేయగలిగే ఇతర మంచి పనులు చాలా ఉన్నాయని, కానీ ఉద్దేశపూర్వకంగానే వివక్ష ప్రదర్శిస్తున్నదని మండిపడ్డారు. ‘40కి పైగా చెరువులు కబ్జా అయ్యాయి. కానీ, హైడ్రా వారిని కనీసం తాకదు. కారణాలు మనందరికీ తెలిసిందే’ అని వ్యాఖ్యానించారు.
ఇలాంటి అధికారిని ఎన్నడూ చూడలేదు
కోర్టు ఆదేశాల విషయంలో ఇలాంటి ధికార ధోరణి కలిగిన అధికారిని న్యాయ చరిత్రలో ఎన్నడూ చూడలేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ స్వయంగా కోర్టుకు వచ్చి విజ్ఞప్తి చేయడం, హైకోర్టు ఉత్తర్వులు తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇవ్వడం వల్లే గురువారం జారీ చేసిన ఆర్మీ చర్యల ఉత్తర్వుల అమలును నిలిపివేశామని పేర్కొన్నారు. ఏజీపై ఉన్న గౌరవంతోనే కమిషనర్‌ను వదిలిపెట్టామని స్పష్టంచేశారు. ఒకే కేసుకు సంబంధించి మూడు ధిక్కరణ పిటిషన్లు దాఖలు కావడాన్ని ఏ కోర్టు కూడా జీర్ణించుకోలేదు. కాబట్టి ఎవరో ఒకరు ఆపాల్సిందేనని, లేకపోతే ఇది చాలా దూరం వెళ్తుందని వ్యాఖ్యానించారు. ఎకడో ఒకచోట కఠిన చర్యలు ప్రారంభం కావాల్సిందేనని పే ర్కొన్నారు. రంగనాథ్ కోర్టుకు హాజరై ఏజీ ద్వారా ఇచ్చిన హామీకి కూడా విలువ ఇవ్వకపోతే ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు.
హైకోర్టు చరిత్రలోనే వినలేదు
రిట్ పిటిషన్ నుంచి అప్పీలు, సివిల్ సూట్, మొదటి కోర్టు ధిక్కరణ కేసు వరకు ఏ దశలోనూ హైడ్రా కమిషనర్ కనీసం పార్టీగా కూడా లేడని న్యాయమూర్తి గుర్తు చేశారు. ఆయన అకస్మాత్తుగా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని, ధర్మాసనాలు ఇచ్చిన ఉత్వర్వులను అమలు చేయకుండా, ఉల్లంఘించారని, ఇలాంటిది హైకోర్టు చరిత్రలోనే ఎన్నడూ వినలేదని చెప్పారు. గత రెండు కోర్టు ధికరణ కేసుల సమయంలో కోర్టు ఉత్తర్వులను తప్పకుండా పాటిస్తామని కలెక్టర్, హైడ్రా ఇచ్చిన హామీలకు విరుద్ధంగా వ్యవహరించడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని పేర్కొన్నారు. హైడ్రా అధికారులు చట్టానికి అతీతులు కారని, వారు తమకు అందనంత దూరంలో లేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. కోర్టు ఆదేశాలను అమలు చేసి తీరాలని, లేదంటే అప్పీల్ చేసుకోవాలని, ఇది చట్టమని చెప్పారు. కోర్టు ఆదేశాల తర్వా త సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేసి ఉత్తర్వులు పొందేవరకు పిటిషనర్ స్థలాన్ని తాకడానికి కూడా వీలులేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు.
చట్టాన్ని అపహాస్యం చేస్తారా?
ఆదేశాల జారీ సమయంలో ‘స్టాండింగ్ కౌన్సిల్’ ఏదో సైగ చేయడాన్ని న్యాయమూర్తి తీవ్రంగా తప్పుపట్టారు. ఈ చర్యలను రికార్డు చేయమంటారా? అని ప్రశ్నించారు. ఒకసారి ‘స్టాండింగ్ కౌన్సిల్’ అనే విషయాన్ని మరచిపోయి ఈ వ్యవహారాన్ని జనం కోణంలో చూడాలని హితవు చెప్పారు. ఒకసారి అటువైపు కూర్చున్న వారు ఇటువైపు నిలబడి వాస్తవాలను చూడాలని వ్యాఖ్యానించారు. రేపు రాత్రికిరాత్రే హైడ్రా అధికారులు మీ ఇండ్లకు వచ్చి కూల్చేస్తామంటే మీరు ఏం చేస్తారని ప్రశ్నించారు. చట్టాన్ని అపహాస్యం చేయడం, చట్టాన్ని హేళన చేయడం, న్యాయవ్యవస్థను ఎగతాళి చేసేలా వ్యవహరించడం, కోర్టు ఆదేశాలను కావాలని ఉద్దేశపూర్వకంగా అమలు చేయకుండా కోర్టు ధికార చర్యలకు పాల్పడటం, న్యాయస్థానాల ఉత్తర్వులను హాస్యాస్పదంగా మార్చేలా హైడ్రా చర్యలు ఉంటే ఏమాత్రం ఉపేక్షించబోమని న్యాయమూర్తి హెచ్చరించారు. కనీసం క్షమాపణ కోరరా?
శుక్రవారం సమర్పించిన అఫిడవిట్ పేలవంగా ఉన్నదని న్యాయమూర్తి తప్పుబట్టారు. కోర్టు ధికరణ కేసుల్లో బేషరతుగా క్షమాపణలు కోరడం న్యాయ ప్రక్రియలో పరిపాటి అని, చట్టపరంగానూ అదే విధానం పాటించాల్సి ఉంటుందని పేరొన్నారు. కానీ, ఒకే కేసులో మూడు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలైన తర్వాత కూడా హైడ్రా కమిషనర్ మాత్రం ఎలాంటి బేషరతు క్షమాపణలు చెప్పకుండా తప్పు చేయలేదంటూ అఫిడవిట్ దాఖలు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
సోమవారం జరిగే తదుపరి విచారణకు ముందే బేషరతు క్షమాపణలతో కూడిన అఫిడవిట్ సమర్పించాల్సిందేనని స్పష్టంచేశారు. తకువ వ్యవధిలో కౌంటర్ దాఖలు చేస్తున్నామని, వివరంగా అదనపు కౌంటర్ అఫిడవిట్ సమర్పించేందుకు అనుమతి ఇవ్వాలని కోరడంపై న్యాయమూర్తి ఆశ్చర్యం వ్యక్తంచేశారు. హైడ్రా చర్యలు కోర్టు ధికరణను స్పష్టంగా చూపుతున్న నేపథ్యంలో ‘వివరణాత్మక అదనపు కౌంటర్ అఫిడవిట్’ అంటే ఏమిటో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. అయినా ఏజీ ఇచ్చిన హామీని పరిగణనలోకి తీసుకొని సంయమనం పాటిస్తున్నామని పేర్కొన్నారు. హైడ్రా దాఖలు చేయబోయే అఫిడవిట్‌లోని అంశాలను పరిశీలించాక మిలిటరీ యాక్షన్ ఉత్తర్వుల అమలుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేశారు.
ఆయనే ఒక చట్టమని అనుకుంటున్నారా? రెవెన్యూ శాఖ, ఇరిగేషన్ శాఖ.. ఇలా ప్రతి ఒక్కరూ ఆయన దగ్గరికే వెళ్తున్నారు. చివరికి పోలీసులు కూడా హైడ్రాను ఆశ్రయించే దుస్థితి ఎందుకు వచ్చింది. ఈ పరిస్థితిని ఎవరు కల్పించారు. ఇతర ప్రభుత్వ శాఖలతో పని లేకుండా అన్నీ హైడ్రానే చేస్తుందని అనుకుంటే, మిగతా చట్టాలను రద్దు చేసి, హైడ్రానే ఒక చట్టంగా చేస్తే సరిపోతుంది కదా. -హైకోర్టు
హైడ్రాకు కల్పించిన అసాధారణ అధికారాలను చూస్తుంటే మాటలు రావడం లేదు. ఒక ప్రభుత్వ జీవోతో ఏర్పాటైన సంస్థ అన్నీ శాఖలకు చట్టబద్ధంగా వచ్చిన అధికారాలను బైపాస్ చేసి, పెత్తనం చెలాయిస్తున్నది. రెవెన్యూ చట్టంలోని 6, 7 సెక్షన్ల ప్రకారం భూ ఆక్రమణలపై చర్యలు తీసుకొనే స్పష్టమైన అధికారాలు రెవెన్యూ శాఖకు ఉన్నాయి.అలాంటప్పుడు ఆయన (హైడ్రా కమిషనర్) అక్కడేం చేస్తున్నారు? -హైకోర్టు