మహదేవపూర్/కాళేశ్వరం,జూన్ 7: మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ(లక్ష్మి), అన్నారం బరాజ్‌లను శుక్రవారం భారీనీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బృందం పర్యటన నేపథ్యంలో నిర్మాణ సంస్థ హడావిడి, ఆర్భాటం కనిపించింది. మంత్రి రాకతో కొన్ని రోజులుగా నత్తనడకన సాగిన మరమ్మతు పనుల్లో వేగాన్ని పెంచారు. ముందుగా మంత్రుల బృందం అన్నారం బరాజ్ డౌన్ స్ట్రీమ్ 38వ పిల్లర్ వద్ద జరుగుతున్న గ్రౌటింగ్ పనులను పరిశీలించింది.
ఈఎన్సీ అనిల్ కుమార్, ఈఈ యాదగిరితో మాట్లాడుతూ ఎన్డీఎస్ఈ కమిటీ సూచనల ప్రకారం అన్ని పనులు చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సూచించారు. ఇంకో 15 రోజుల్లో అన్ని పనులు పూర్తి చేస్తామని ఇంజినీర్లు తెలిపారు.
ఇక్కడ ఇంకా ఏం పనులు చేయాలని మంత్రి అడగగా, సీడబ్ల్యూడీఆర్ఎస్ సాయిల్ టెస్టులు చేయించాలని, వాటికి రూ. కోటికిపైగా ఖర్చవుతుందని చెప్పడంతో రేపటి లోగా నిధులు విడుదల చేస్తామని పేర్కొన్నారు. బరాజ్ నీరు కిందకు వదలడంతో మంచిర్యాల జిల్లాలోని తమ ఊరు మునుగుతోందని, కరకట్ట నిర్మాణం చేయాలని సుందరసాల గ్రామస్తులు కోర గా పరిశీలన చేయండని కలెక్టర్ భవేశ్మిశ్రాతో చెప్పారు.
అనంతరం మంత్రుల బృందం మేడిగడ్డకు చేరుకొని ఎల్సీ క్యాంపు కార్యాలయంలో ఎల్టీ ప్రతినిధులు, నీటిపారుదల శాఖ అధికారులతో మరమ్మతులపై రివ్యూ నిర్వహించారు. పనుల పురోగతి పై చర్చించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అక్కడి నుంచి బరాజ్‌కు చేరుకొని ఏడో బ్లాక్ వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. వానకాలంలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్పీ కిరణ్‌ఖరే, రామగుండం, ధర్మపురి, భూపాలపల్లి ఎమ్మెల్యేలు మ క్కాన్‌సింగ్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, గండ్ర సత్యనారాయణరావు, సీఈ సుధాకర్‌రెడ్డి, నాగేందర్, ఎల్టీ సంస్థ ప్రతినిధి సురేశ్‌కుమార్, డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి ఇంజినీరింగ్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.