ములుగు, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ)/కన్నాయిగూడెం : దేవాదుల ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను తరలించి ఉమ్మడి వరంగల్, నల్గొండ, కరీంనగర్ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం దేవాదుల పంపుహౌస్, మోటర్లతో పాటు ఇన్‌టేక్ వెల్, సమ్మక్క బరాజ్‌ను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్కతో కలి సి ఆయన సందర్శించారు.
అనంతరం గోదావరి నదికి పూజలు చేశారు. ప్రాజెక్టు పనుల పురోగతిని నీటి పారుదల శాఖ ఈఅండ్‌సీ అనిల్, సీఈలు విజయ్‌భాస్కర్, అశోక్‌కుమార్‌లు దశలవారీగా పనుల వివరాలు, ఖర్చు చేసిన నిధులు, రావాల్సిన నిధు లు, పెండింగ్ పనులకయ్యే ఖర్చు, పనుల ఆలస్యానికి గల కారణాలు, భూసేకరణ లోపానికి కారణాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మం త్రులకు వివరించారు. అనంతరం నీటి పారుదల శాఖ అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు పలు నియోజకవర్గాలకు సాగునీటితో పాటు తాగునీరు అందించేందుకు చేపట్టిన జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టును 2026 మార్చి నాటికి పూర్తిచేసి సోనియాగాంధీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయిస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గ్రామీణ తెలంగాణ ముఖచిత్రం మార్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఒక్కో ప్రాజెక్టును రివ్యూ చేసుకుంటూ పనులు కొనసాగించేందుకు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులతో దేవాదు ల ప్రాజెక్టును సైతం పూర్తి చేసేందుకు అధిక ప్రాధాన్యతతో చర్యలు చేపడుతున్నామన్నారు.
ప్రాజెక్టు నిర్మించే క్రమంలో సంవత్సరానికి 170రోజుల పా టు 38 టీఎంసీలను ఎత్తిపోసేలా డిజైన్ చేశామని, ప్రస్తుతం సమ్మక్క బరాజ్ అందుబాటులోకి రావడంతో నీటి సామర్థ్యం పెరిగిందన్నారు. ఈ నీటిని ఉపయోగించుకునేలా దేవాదుల ప్రాజెక్టు ద్వారా ఒక సంవత్సరంలో 300 రోజుల పాటు నీళ్లను లిఫ్ట్ చేసి ఎత్తిపోతల ద్వారా 60 టీఎంసీల గోదావరి జలాలను దేవాదుల ద్వారా సాగునీటితో పాటు తాగునీటిని అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతి ఎకరానికి నీరు అందేలా కృషి చేస్తామని చెప్పారు. సమ్మక్క బరాజ్ అనుమతులను సాధించేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో మాట్లాడి ఎన్ఓసీ తీసుకొని కేంద్ర జలసంఘం ద్వారా నీటి అనుమతులు సాధిస్తామని తెలిపారు. ప్రజాప్రతినిధులు చెప్పిన అన్ని విషయాలను సాధ్యమైనంత వరకు పరిశీలిస్తామని చెప్పారు. భూసేకరణ విషయంలోనూ మానవీయ కోణంలో ఆలోచించి రైతులకు కోరిన ధర చెల్లిస్తామని తెలిపారు. ప్రాజెక్టుల భూసేకరణ కోసం ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారిని నియమించామని, కలెక్టర్లతో సమన్వయం చేసుకొని అడ్డంకులు లేకుండా చూస్తామన్నారు.
మోడికుంట ప్రాజెక్టును కూడా అనుమతులు కల్పించి త్వరలో పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. ఇరిగేషన్ శాఖను బలోపేతం చేసేందుకు 700మంది ఏఈలను ఇటీవల భర్తీ చేశామని అన్నారు. అలాగే 1800మంది లష్కర్లను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల్లో సిల్ట్‌ను తొలగించేందుకు ఈ-సిల్టింగ్తో పాటు కెనాళ్లలో జంగల్ కట్టింగ్ పనులను కూడా ప్రారంభిస్తామన్నారు. దీనికి రూ.1100 కోట్లను కేటాయించనున్నట్లు మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో 14 ఏళ్లుగా నత్తనడకన కొనసాగుతున్న దేవాదుల పనులను వేగవంతం చేసేందుకు మొదటి ప్రాధాన్యమిచ్చి గ్రీన్‌చానల్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పెం డింగ్ బిల్లులు లేకుండా కాంట్రాక్టర్లకు చెల్లిస్తూ పూర్తి చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. దేవాదుల ద్వారా 3లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తున్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ అంత మేర అందడం లేదని తమ దృష్టికి వచ్చిందని 5లక్షల 50వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా కృషిచేస్తామన్నా రు.
ప్రాజెక్టు కోసం ఇంకా 3వేల ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉందని, రూ.1150 కోట్లను ఖర్చు చేయాల్సి ఉందని తెలిపారు. నవంబర్ 15లోగా చిన్న చిన్న పనులను పూర్తి చేస్తామని చెప్పారు. దేవాదుల సమీపంలో గోదావరిపై సమ్మక్క బరాజ్ నిర్మించడం ద్వారా పంప్‌హౌ స్ వద్ద 5 నుంచి 6టీఎంల సామర్థ్యం పెరిగిందని, వీటిని కూడా ఎత్తిపోతల ద్వారా లిఫ్టింగ్ చేస్తామని, దానికి తగిన ఆదేశాలను సైతం ప్రభుత్వం ద్వారా జారీ చేస్తామని మంత్రి అ న్నారు. గత ప్రభుత్వంలో చేసిన పనులకు బి ల్లులు ఇచ్చేందుకు వెనకాడేది లేదన్నారు. ఇప్పటికే 7వేల కోట్లను చెల్లించామని తెలిపారు.
దేవాదుల ద్వారా ఇతర ప్రాంతాలకు నీళ్లు తరలుతున్నప్పటికీ ములుగు నియోజకవర్గానికి మాత్రం అందడం లేదని, గత ప్రభుత్వం రామ ప్ప నుంచి లక్నవరానికి గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని తరలించేందుకు భూసేకరణ జరపగా ఎకరానికి రూ.3లక్షల నష్టపరిహారమే ప్రకటించిందని, ప్రస్తుతం భూమి విలువ పెరిగినందున నిర్వాసితులకు తగిన పరిహారం అందిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహి ళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అన్నా రు.
మల్లూరు ప్రాజెక్టుకు గంగారం వాగును మళ్లించి నీటి సామర్థ్యాన్ని పెంచాలన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం వచ్చేలా ప్రాజెక్టుల ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. రామప్ప, లక్నవరం లింకును పూర్తి చేయాలన్నారు. నియోజకవర్గంలోని చెరువులు, కుంటలను గోదావరి జలాలతో నింపేలా చర్యలు చేపడుతామన్నారు.
దేవాదుల ప్రాజెక్టు ఉమ్మడి జిల్లాకు వరప్రదాయిని వంటిదని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అన్నారు. 15 సంవత్సరాల నుంచి పనులు నత్తనడకన సాగుతున్నాయని అన్నారు. సమ్మక్క బరాజ్ ద్వారా ఎగువ నుంచి వస్తున్న నీటిని నిల్వ చేస్తూ దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా తరలించి ఆయకట్టును పెంచాలన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాను దృష్టిలో ఉంచుకొని సమగ్ర ప్రణాళికతో నీటిని అందించాలని కోరారు. సాధ్యమైనంత త్వరలో అధిక ప్రాధాన్యతను ఇస్తూ పూ ర్తి చేయాలని ప్రకాశ్ కోరారు.
సమావేశంలో నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రశాంత్‌జీవన్ పాటిల్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్వినీరెడ్డి, దొంతి మాధవరెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కె.ఆర్.నాగరాజు, డాక్టర్ మురళీనాయక్, కలెక్టర్ టి.ఎస్. దివాకర, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, ఎస్పీ పి.శబరీష్, ఓఎస్డీ మహేశ్ బాబా సాహెబ్ గీతే, ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, డీఎస్పీ రవీందర్, ఈఈలు, డీఈలు, ఏఈలు, మెఘా కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.