కాశీబుగ్గ, అక్టోబర్ 21 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం మంత్రి సురేఖ వరంగల్ కలెక్టర్ సత్యశారద, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పత్తి రైతులకు గిట్టుబాటు ధర అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు.
రైతులు నాణ్యమైన పత్తిని మార్కెట్‌కు తీసుకొచ్చి గరిష్ఠ ధర పొందాలని సూచించారు. మార్కెట్‌కు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని, మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. తేమను దృష్టిలో పెట్టుకొని పత్తికి ధర నిర్ణయిస్తారని అన్నారు. సీసీఐకి అమ్మే రైతులు తప్పనిసరిగా బ్యాంక్ పాస్ బుక్, ఆధార్‌కార్డు తీసుకొని రావాలని, వారికి మూడు రోజుల్లో డబ్బులు అకౌంట్లో పడతాయన్నారు.
కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 27 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించి మొదటి విడతలో వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో 14 ప్రారంభించినట్లు తెలిపారు. మిగతా కేంద్రాలను నర్సంపేటలో ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో జేడీఎం ఉప్పుల శ్రీనివాస్, డీడీఎం పద్మావతి, డీఎంవో సురేఖ, కార్యదర్శి పోలెపాక నిర్మల, కార్పొరేటర్ తూర్పాటి సులోచన, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, సీసీఐ జనరల్ మేనేజర్ అర్జున్దుబే, కృష్ణారెడ్డి, చాంబర్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.