తొర్రూరు, అక్టోబర్ 9: ‘అరవై ఏళ్లు జనాన్ని చావగొట్టిన కాంగ్రెస్ ఒక్క చాన్స్ ఇవ్వమంటోంది. 11 చాన్స్‌లు ఇచ్చినా చేసిందేమీ లేదు. పాలకుర్తిలో నిత్యం జనం మధ్య ఉండి నియోజకవర్గాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేసిన ప్రజల మనిషి దయాకర్‌రావు కంటే మంచోడెవరున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పటికే దయాకర్‌రావు గెలుపు ఖాయమైంది’ అంటూ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో సోమవారం నిర్వహించిన ప్రగతి బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తిరుగులేని నేతగా ఎదిగిన పాలకుర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అమెరికా నుంచి డాలర్లు కుమ్మరించే సంక్రాంతి గంగిరెద్దులను దించుతున్నారని ఎద్దేవా చేశారు. నిత్యం ప్రజల కష్టసుఖాల్లో ఉండే దయాకర్‌రావు కావాలా అమెరికా నుంచి చుట్టపు సూపుగా వచ్చి ఎలక్షన్లు అయిపోగానే పోయేటోళ్లు కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు.
ఎలక్షన్లో కాంగ్రెసోళ్లు ఇమానాలు, ప్రమాణాలు చేయించి పైసలి స్తే డాలర్లు కావాలని తీసుకుని, మనసులో ప్రమాణాలు చెరిపేసి దండిగా దయాకర్‌రావుకు ఓట్లు వేసి గెలిపించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ఆయన మార్గ నిర్దేశంలో పల్లెలను అద్భుతంగా తీర్చిదిద్ది, దేశంలో 2.5శాతం జనాభాతో ఉన్న తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా పనిచేసిన దయాకర్‌రావు సారధ్యంలో 30శాతం ఉత్తమ గ్రామ పంచాయతీలుగా కలిగిన రాష్ట్రంగా అవార్డులు సాధించిందంటే ఆ గొప్పతనం మీ మంత్రికే దక్కిందన్నారు. పాలకుర్తిలో మా వద్ద రైతు బంధు దయాకర్ అంటే అక్కడ 60ఏళ్లు రాష్ర్టాన్ని చెడగొట్టిన రాబందు పార్టీ ప్రత్యర్థిగా ఉందని, ఇంటింటికీ నీళ్లు ఇచ్చిన నేత కావాలో 60ఏళ్లు కన్నీళ్లు ఇచ్చినా వారు కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, వద్దిరాజు రవిచంద్ర, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు డీఎస్.రెడ్యానాయక్, శంకర్‌నాయక్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్లు అంగోతు బిందు, గండ్ర జ్యోతి, రాష్ట్ర ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఎన్.సుధాకర్‌రావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి పాల్గొన్నారు.