ఉద్యమనేత, సీఎం కేసీఆర్ తెలంగాణ గొంతుక అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం ఇల్లెందు పట్టణంలో బీఆర్ఎస్ అభ్యర్థి హరిప్రియతో కలిసి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు తథ్యమని, ఆయన సెంచరీ కొట్టాలంటే ఇక్కడ హరిప్రియ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో రెండుసార్లు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా ఇల్లెందులో ప్రతిపక్షమే గెలిచిందని, ఈ సారి మాత్రం పరిస్థితి మారిందన్నారు. ప్రభుత్వ ఏర్పాటులో ఇల్లెందు నియోజకవర్గం పాత్ర కీలకమని సీఎం అంటున్నారని, అది జరగాలంటే ఈ నెల 30న ఇల్లెందులో హరిప్రియ అత్యధిక మెజార్టీతో గెలవాలని అన్నారు. ఏజెన్సీలోని గిరిజనేతరుల పోడు భూములకు పట్టాలివ్వడానికి కేంద్రం అడ్డుపడుతున్నదని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మోదీని పక్కకు జరిపి అవి కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్‌కు 11 సార్లు అవకాశం ఇస్తే ప్రజలకు ఏమీ చేయలేకపోయిందని, ఇప్పుడు మళ్లీ అవకాశమిస్తే పంటికి అంటకుండానే మనల్ని మింగుతుందని, అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఇల్లెందు, నవంబర్ 19: తెలంగాణకు ఉన్న ఒకే ఒక్క గొంతుక సీఎం, ఉద్యమ నేత కేసీఆర్ అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఆయన సారథ్యంలోనే తెలంగాణ సిద్ధించిందని, ఆయన పాలనలోనే అద్భుత ప్రగతి సాధించిందని స్పష్టం చేశారు. ఆయన నాయకత్వంలో ఈసారి కూడా ప్రభుత్వ ఏర్పాటు తథ్యమని తేల్చిచెప్పారు. ఆయన సెంచరీ కొట్టి వంద సీట్లు సాధించాలంటే ఇక్కడ హరిప్రియ గెలవాల్సిన అవసరం ఉంద ని స్పష్టం చేశారు. అందుకోసం ఆమెకు ఇక్కడి ప్రజలు అధిక మెజార్టీ అందించాలని పిలుపునిచ్చారు. అసెం బ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఇల్లెందుకు వచ్చిన ఆయన.. పట్టణంలో నిర్వహించిన రోడ్‌షోలో మాట్లాడారు. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్‌కు 11 సార్లు అవకాశం ఇస్తే ప్రజలకు ఆ పార్టీ ఏమీ చేయలేకపోయిందని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ ఏమరపాటుగా ఆ పార్టీకి మరోసారి అవకాశం ఇస్తే పంటికి అంటకుండానే మనల్ని మింగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకని ఈ ఎన్నికల వేల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
రాష్ర్టాన్ని 55 ఏళ్లపాటు పాలించిన కాంగ్రెస్.. తమ పాలనలో 24 గంటల కరెంట్, తాగునీరు, సాగునీరు ఎందుకు ఇవ్వలేదని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. రైతుబంధు, కల్యాణలక్ష్మీ పథకాలను ఎందుకు అమలు చేయలేదని, పోడు పట్టాలుగానీ, సింగరేణి కార్మికులకు 34 శాతం బోనస్గానీ ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్కాములు చేయడం, రాష్ర్టాన్ని మింగడమే కాంగ్రెస్ విధానమని దుయ్యబట్టారు. కానీ అదే సమయంలో ఇవన్నీ ఇచ్చిన సీఎం కేసీఆర్‌ను చిన్న చిన్న కారణాలతో వదులుకోవద్దని కోరారు. తెలంగాణ ప్రజల కోసం పేగులు తెగే దాకా కొట్లాడిన కేసీఆర్‌ను మరవొద్దని విజ్ఞప్తి చేశారు. ఎప్పటికైనా మనవాళ్లు మనవాళ్లే, పరాయివాళ్లు పరాయివాళ్లే అవుతారని అన్నారు. తెలంగాణపై కేసీఆర్‌కు ఉన్న ప్రేమ.. రాహుల్గాంధీకిగానీ, నరేంద్రమోదీకిగానీ ఇసుమంతైనా ఉండదని అన్నారు. ప్రజలు దయచేసి ఈ విషయాన్ని గమనించాలని కోరారు. సింగరేణిని ప్రైవేటుపరం చేస్తామని ప్రధాని మోదీ అంటుంటే రాహుల్‌గాంధీ ఎందుకు మట్లాడలేదని నిలదీశారు. కానీ అదే సమయంలో సింగరేణిని ప్రైవేట్‌పరం చేయొద్దంటూ మళ్లీ కేసీఆరే కొట్లాడారని గుర్తుచేశారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయకుండా మోదీ కాలయాపన చేసినా కాంగ్రెస్ ఎందుకు మాట్లాడడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెండుసార్లు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా ఇల్లెందులో ప్రతిపక్షమే గెలిచిందని అన్నారు. కానీ ఈసారి ఇక్కడ పరిస్థితి మారిందని అన్నారు. ఉమ్మడి జిల్లాలో ఈసారి సింహభాగం సీట్లు కొట్టాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ ఏర్పాటులో ఇల్లెందు పాత్ర కీలకమని సీఎం అంటున్నారని, అది జరగాలంటే ఈ నెల 30న ఇల్లెందులో హరిప్రియ అత్యధిక మెజార్టీతో గెలవాలని అన్నారు. ఇక్కడి ప్రజల ఉత్సాహం, ఊపు చూస్తుంటే వంద శాతం గెలుస్తారని అనిపిస్తోందని అన్నారు. అలాగే, డిసెంబర్ 3 తర్వాత గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే అని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన మ్యానిఫెస్టోను అమలు చేస్తామని అన్నారు. ఏజెన్సీలోని గిరిజనేతరుల పోడు భూములకు పట్టాలివ్వడానికి కేంద్రం మోకాలడ్డుతోందని ఆరోపించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల తర్వాత మోదీని పక్కకు జరిపి అవి కూడా సాధిస్తామని అన్నారు. ఇంకా మిగిలి ఉన్న కొన్ని పోడు పట్టాలను ఇస్తామని, కొత్త రేషన్ కార్డులు కూడా మంజూరు చేస్తామని తెలిపారు. హరిప్రియకు ఆరోగ్య సమస్యలున్నా, ఓ బిడ్డకు జన్మనిచ్చినా సమ్మక్క, సారక్క మాదిరిగా అంతటి తెగువతో నియోజకవర్గ అభివృద్ధి కోసం కొట్లాడిందని గుర్తుచేశారు. పట్టణ అభివృద్ధి కోసం కూడా తన చెల్లెలు హరిప్రియ తనతో కొట్లాడి మరీ నిధులు తెచ్చి ఈ ప్రాంత రూపురేఖలను మార్చిందని వివరించారు. ఈ ప్రాంత రైతుల సీతారామ ప్రాజెక్టును సాధించిందని అన్నారు. ఆ ఎత్తిపోతల పథకాన్ని కూడా త్వరలోనే పూర్తి చేసి గోదావరి నీళ్లతో ఇక్కడి రైతుల కాళ్లు కడుగుతామని అన్నారు. ఇక్కడ కొన్ని అలకలు, అసంతృప్తులు ఉన్నాయని, అయినా వాటికి ఇది సమయం కాదని, తెల్లారి హరిప్రియతో అభివృద్ధి పనులు చేయించుకోవాలని సూచించారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతోనే నియోజకవర్గంలో ఇంతటి అభివృద్ధి చేయగలిగానని బీఆర్ఎస్ అభ్యర్థి హరిప్రియ పేర్కొన్నారు. బస్ డిపో, 100 బెడ్ల ఆసుపత్రి, డయాలసిస్ కేంద్రం, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, మల్టీ యుటిలిటీ సెంటర్, మోడల్ మార్కెట్, ప్రధాన రహదారి, సీతారామ ప్రాజెక్టు వంటివన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే సాధ్యమయ్యాయని గుర్తుచేశారు. ప్రజలు కోరుకుంటున్న కొమరారం, బోడు మండలాలను ఏర్పాటు చేయాలని, ఇల్లెందును రెవెన్యూ డివిజన్ చేయాలని, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించాలని కోరారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఇతర ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు దిండిగాల రాజేందంర్, ఆంగోత్ బిందు, ఊకే అబ్బయ్య, మడత వెంకట్‌గౌడ్, జానీపాషా, ప్రవీణ్‌నాయక్, ఎస్.రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. న్నారు.
గార్ల మండలానికి చెందిన లక్కినేని సుధీర్, ఇల్లెందుకు చెందిన డాక్టర్ భాస్కర్‌నాయక్ తదితరులు మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కాగా, మంత్రి కేటీఆర్ రోడ్ షో సందర్భంగా ఇల్లెందు పట్టణం జనసంద్రమైంది.