వరంగల్ చౌరస్తా/కరీమాబాద్/ పోచమ్మమైదాన్/కాశీబుగ్గ, జనవరి 5 : సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రూపొందించిన సంక్షేమ పథకాల ఫలితాలను అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి అందజేస్తామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం 36వ డివిజన్ జమాతే ఇస్లాం హింద్ హాల్, ఉర్సు సీఆర్సీ, 19వ డివిజన్ స్వశక్తి భవన్, దేశాయిపేట, 34వ డివిజన్ భూపేష్‌నగర్‌లో ప్రజాపాలన కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషాతో కలిసి దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి వారికి రసీదులను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రకటించిన విధంగానే ఆరు గ్యారెంటీల అమలు కోసమే దరఖాస్తులు తీసుకుంటున్నామని చెప్పారు.
దరఖాస్తులను పరిశీలించి అర్హులను గుర్తిస్తామన్నారు. వంద రోజుల వ్యవధిలోనే గ్యారెంటీలను అమలు చేసి చూపిస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందజేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. అందుకు అనుగుణంగా కార్యాచరణ సైతం సిద్ధం చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎండీ ఇక్బాల్, పోపా రాష్ట్ర అధ్యక్షుడు శామంతుల శ్రీనివాస్, కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు షేక్ సోహైల్, నియోజకవర్గ నాయకుడు చాంద్‌పాషా, మాజీ కార్పొరేటర్లు బత్తిని వసుంధర, కత్తెరశాల వేణుగోపాల్, కేడల పద్మ, నాయకులు అక్తర్, చీర అరుణ, కరాటే ప్రభాకర్, డివిజన్ అధ్యక్షుడు దాసరి రాజేశ్ పాల్గొన్నారు.
దేశాయిపేటలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయ అభివృద్ధి కోసం కృషిచేస్తానని సురేఖ తెలిపారు. ఆలయం గురించి పూజారులు కొండపాక రంగాచార్య, శ్రీనివాసాచార్య, విష్ణుతేజ వివరించగా అభివృద్ధి కోసం రూ.10లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.