స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 25 : నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల 28న నిర్వహించే బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభకు మంత్రి హరీశ్‌రావు హాజరు కానున్నట్లు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తెలిపారు. నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించిన అనంతరం నియోజకవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. బుధవారం నియోజకవర్గ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ.. నియోజకవర్గ సమావేశానికి మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, చీఫ్‌విప్ వినయ్ భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే రాజయ్యతో పాటు పలువురు హాజరు కానున్నారని తెలిపారు. తొమ్మిదేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు ఇటీవల విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టోతో బీఆర్ఎస్ విజయం ఖాయమైందని, డిసెంబర్ మూడున ఆ ఫలితాలను చూడబోతున్నామని కడియం పేర్కొన్నారు. ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అక్కడి ప్రజలకు రోజుకు ఐదు గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదని, ప్రజలు ధర్నాలు , రాస్తారోకోలు చేస్తున్నారన్నారు. అక్కడ 24 గంటల కరెంటు ఇవ్వకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను ఆదుకుంటామని చెప్పడం సిగ్గు చేటని పేర్కొన్నారు. ఆ పార్టీ నాయకులకు వారి అభివృద్ధి తప్ప రాష్ట్ర ప్రజల బాగోగులు పట్టవని కడియం శ్రీహరి విమర్శించారు.
తెలంగాణ ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు, కేసీఆర్ కిట్టు, ఆసరా పెన్షన్, రైతు బీమా, రైతు బంధు వంటి పథకాలను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఒకవేళ అమలు అవుతున్నట్లు నిరూపిస్తే ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటానని, నిరూపించకపోతే కాంగ్రెస్ పార్టీ పోటీ నుంచి తప్పుకోవాలని కడియం డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు పదవులు లేక మతిభ్రమించి, పిచ్చెక్కి వారు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదన్నారు. వారి మాటలు వింటే నవ్వాలో, జాలిపడాలో అర్థం కావడం లేదని అన్నారు. తుపాకీ రాముడిలా, ఉత్తర కుమారులా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలతో చీ అనిపించుకున్న రేవంత్ రెడ్డి, రాజగోపాల్‌రెడ్డిలు దమ్ముంటే తమపై పోటీ చేయాలని సవాల్ విసరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజలు చీ కొట్టినా కూడా సవాలు విసిరితే కేఏ పాల్, షర్మిలకు వారికి తేడా ఏముందని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం ఎంతో మంది వచ్చి అబద్ధాల హామీలతో ప్రజలను మభ్యపెట్టడానికి వస్తుంటారని, అలాంటి వారి మాటలు నమ్మి వారికి ఓటు వేస్తే రాష్ట్రం ఆగమవుతుందని, అభివృద్ధి కుంటుపడుతుందని, జాగ్రత్తగా ఉండాలని కడియం శ్రీహరి ప్రజలను కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు చింతకుంట్ల నరేందర్‌రెడ్డి, బెలిదె వెంకన్న, బూర్ల శంకర్, రాపోలు మధుసూదన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అన్నం బ్రహ్మారెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు పోగుల సారంగపాణి, మామిడాల లింగారెడ్డి, ఎంపీపీ సరితా బాలరాజు, మాజీ మండలాధ్యక్షుడు అక్కనపల్లి బాలరాజు, ఎంపీటీసీ రజాక్ యాదవ్, సొసైటీ చైర్మన్ తీగల కరుణాకర్‌రావు, రైతు బంధు సమితి బాధ్యుడు తోట వెంకన్న, గాదెపాక సుధాకర్ బాబు, తెల్లాకుల రామకృష్ణ, జీడీ ప్రసాద్, అన్నెపు కుమార్ పాల్గొన్నారు.