మహబూబాబాద్/ములుగు, సెప్టెంబర్ 28(నమస్తే తెలంగాణ)/ నర్సంపేట/ నర్సంపేట రూరల్ : ఉమ్మడి జిల్లాలో గురువారం ప్రగతి జాతర కొనసాగింది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ కవితతో కలిసి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ములుగు, నర్సంపేట, మరిపెడలో పర్యటించారు. ముందుగా ములుగు జిల్లా కేంద్రంలోని ప్రేమ్‌నగర్ వద్ద రూ.180కోట్లతో నిర్మించే మెడికల్ కాలేజీ భవనానికి, రామచంద్రాపురంలో రూ.2.36కోట్లతో నిర్మించే 33కేవీ సబ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ వైద్యశాలలో రూ.54లక్షలతో ఏర్పాటు చేసిన నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం బండారుపల్లి రోడ్డులోని తంగేడు మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. జిల్లాలోని దళితబంధు, గృహలక్ష్మి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. బీఆర్ఎస్ ములుగు అభ్యర్థి బడే నాగజ్యోతి, మంత్రులు సత్యవతి, ఎర్రబెల్లి సూచనల మేరకు ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై సీఎం కేసీఆర్‌తో చర్చించి ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు.
ములుగు జిల్లాకు ప్రత్యేకంగా మూడు వేల గృహలక్ష్మి ఇండ్ల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంగపేటకు ఆర్టీసీ బస్టాండ్, కొత్తగూడకు ప్రభుత్వ దవాఖానను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 60ఏండ్లలో కాని అభివృద్ధిని రాష్ట్రంలో పదేళ్లలో చేసి చూపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని, ప్రజలు సీఎం కేసీఆర్‌కు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ములుగు జిల్లాలోని ప్రాంతాలకు గోదావరి జలాలను అందుబాటులోకి తెచ్చేందుకు సమగ్ర ప్రణాళికతో సిద్ధమవుతున్నట్లు మంత్రి వెల్లడించారు. అనంతరం వరంగల్ జిల్లా నర్సంపేట శివారులోని జిల్లా వైద్యశాల ఆవరణలో రూ.183 కోట్లతో ప్రభుత్వ మెడికల్ కళాశాల భవన శిలాఫలకాన్ని మంత్రులు ఆవిష్కరించారు. నర్సంపేట వ్యవసాయ మార్కెట్ ఆవరణలో జరిగిన సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. గృహలక్ష్మి, దళిత బంధు మంజూరు పత్రాలను పంపిణీ చేయడంతో పాటు సబ్సిడీపై వ్యవసాయ పకరాలను అందించారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలో వంద పడకల వైద్యశాలకు శంకుస్థాపన చేశారు. తొర్రూరు పట్టణానికి చెందిన వంద పడకల వైద్యశాలకు సైతం ఇక్కడే శంకుస్థాపన చేశారు.
ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు వచ్చిన మంత్రులకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. దారిపొడవునా బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. ఆయాచోట్ల నిర్వహించిన బహిరంగ సభలకు ప్రజలు వేలాదిగా తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మంత్రులు మాట్లాడుతుండగా చప్పట్లు, ఈలలతో తమ మద్దతును ప్రకటించారు.