‘తెలంగాణ అభివృద్ధికి కేంద్రం మోకాలడ్డుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు బీజేపీ నాయకులు అడుగడుగునా ద్రోహం చేశారు. బీఆర్ఎస్ను విమర్శించే అర్హత వారికి లేదు. రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏం తెచ్చారో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పాలి. గిరిజన వర్సిటీ, సైనిక్ స్కూల్, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎప్పుడిస్తారో దమ్ముంటే ప్రజలకు స్పష్టం చేయాలి.’ అని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం బహిరంగ సభ కోసం మంత్రులు దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌తో కలిసి శనివారం తొర్రూరులో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 18న జరుగనున్న ఖమ్మం సభకు జిల్లా నుంచి లక్షకు పైగా జనాన్ని సమీకరించాలని నేతలకు సూచించారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లికి మెడికల్ కాలేజీలు వచ్చాయని, త్వరలోనే తరగతులూ ప్రారంభిస్తా మన్నారు.
తొర్రూరు, జనవరి 14 : ‘ఉమ్మడి వరంగల్ జిల్లాకు బీజేపీ ఏం చేసిందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. నేను అడిగే నాలుగు ప్రశ్నలకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలి… బీఆర్ఎస్ను విమర్శించే నైతిక హక్కు బీజేపీకి ఎక్కడిది..’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. ఖమ్మంలో బీఆర్ఎస్ సభ విజయవంతం కోసం శనివారం మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలతో కలిసి నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన ఏ పనులను మంజూరు చేసేందుకు కేంద్రం ముందుకు రాకపోగా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ నేతలు నిధులకు కోతలు పెట్టిస్తూ కాళ్లలో కట్టెలు పెట్టి అడ్డుపడుతున్నారని ఎద్దేవా చేశారు.
గిరిజన యూనివర్సిటీ స్థాపనకు 330 ఎకరాల స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇస్తే ఎనిమిదేళ్లయినా అతీగతి లేదన్నారు. వరంగల్‌లో సైనిక్ స్కూల్ పెట్టాలని కోరుతూ సీఎం కేసీఆర్ అన్ని వనరులు సమకూర్చినా మంజూరు ఇవ్వకుండా నాన్చుతున్నారని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి అనుమతి ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పాలన్నారు. అభివృద్ధిని అడ్డుకుంటూ బీఆర్ఎస్ను విమర్శించడం బీజేపీ నేతల నీతిమాలిన తనానికి నిదర్శనమన్నారు. సీఎం కేసీఆర్ కాదనుకుంటే మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లికి మెడికల్ కాలేజీలు వచ్చేవేనా.. అని ప్రజలు ఆలోచించాలన్నారు. ఈ ఏడాది నుంచే మహబూబాబాద్‌లో పారామెడికల్ బీఎస్సీ, నర్సింగ్ కళాశాలను ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. సీఎం కేసీఆర్ వరంగల్ ఉమ్మడి జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు ఎస్సారెస్పీకి జీవం తెచ్చేలా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో నీళ్ల కోసం తల్లడిల్లే ఈ ప్రాంతం ఇక నీళ్లు చాలు అనే పరిస్థితికి చేరుకుందన్నారు. గుంట భూమి ఖాళీగా లేకుండా వ్యవసాయం జోరుగా సాగుతోందని ఇది వా స్తవం కాదా అని బీజేపీ నేతలను ప్రశ్నించారు.
డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కలిసినప్పుడల్లా మాకు సాగు నీళ్లు ఇవ్వాలంటూ విన్నవించే వారని, ఇప్పుడు ఇక నీళ్లు చాలు పొలాలు జాలువారుతున్నాయని చెబుతున్నారని హరీశ్‌రావు వివరించారు. ఇది కాళేశ్వరం గొప్పతనం కాదా అన్నారు. వ్యవసాయం పండుగలా సాగాలని పెట్టుబడికి నిధులు, 24 గంటల ఉచిత విద్యుత్, ఎరువులకు కొరత లేకుండా సరఫరా చేయడం.. ఇది కదా రైతులకు నిజమైన సంక్రాంతి అని చెప్పారు. రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తున్నామని, పొరుగు రాష్ర్టాలైన ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిశాలో మన ఉమ్మడి వరంగల్ జిల్లా మిల్లర్లు, వ్యాపారులు క్వింటాలుకు రూ.1500 నుంచి రూ.1600 వరకు వెచ్చించి కొనుగోలు చేస్తే తెలంగాణలో మాత్రం కచ్చితంగా మద్దతు ధరతో ప్రభుత్వమే ధాన్యం కొంటున్నది వాస్తవం కాదా అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. రైతులు రోడ్ల వెంట ధాన్యం ఆరబోస్తే ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, కల్లాలు కట్టుకునేందుకు ఉపాధిహామీ పథకంలో అనుమతులు ఇస్తే కేంద్రం కళ్ల మంటతో రూ.1200 కోట్ల నిధుల విడుదలను నిలిపివేసిందని మండిపడ్డారు. దేశంలో అనేక సముద్ర తీర ప్రాంతాల్లో చేపలు ఎండబెట్టుకోవడానికి కల్లాలు నిర్మించుకునేందుకు అనుమతులు ఇస్తూ తెలంగాణలో మాత్రం ధాన్యం ఆరబోతకు అనుమతులు లేవని చెబుతుండడం కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనమన్నారు.
దేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోయేలా ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ నిర్వహించే బహిరంగ సభకు మహబూబాబాద్ జిల్లా నుంచి లక్ష మందిని తరలించే లక్ష్యాన్ని అధిగమించాలనని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఎన్ని పనులున్నా నాయకులు ఈ మూడు రోజులు వారి లక్ష్యాలను చేరుకునేలా ప్రజలను తరలించాలని కోరారు. ప్రతి గ్రామం, పట్టణం నుంచి వచ్చే ప్రజల వెంటే బీఆర్ఎస్ నాయకులు కలిసి వచ్చి సభా ప్రాంగణంలో వారి మధ్యే కూర్చొని జాగ్రత్తగా ఇంటికి చేరుకునేలా బాధ్యత తీసుకోవాలన్నారు.. ఖమ్మం చుట్టు పక్కల 10 నుంచి 12 నియోజకవర్గాల పరిధిలోని బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు సభకు చేరుకునేలా పార్టీ నిర్ణయించిందని చెప్పారు. పండుగలు, వ్యవసాయ పనులు ఉన్నందున మండలాలు, గ్రామాలు, నియోజకవర్గాల ఇన్చార్జీలు, పరిశీలకులు ప్రణాళికయుతంగా ఖమ్మం బహిరంగ సభ సక్సెస్ చేసేలా బాధ్యతలు నిర్వర్తించాలని చెప్పారు.
మంత్రి దయాకర్‌రావు కోరిక మేరకు తొర్రూరు రెవెన్యూలోని ప్రభుత్వ రెఫరల్ ఆసుపత్రిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా ఉన్నతీకరించి 100 పడకల ఆసుపత్రిగా ఆధునీకరించేందుకు త్వరలోనే అనుమతులు ఇస్తామని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. అనంతరం తొర్రూ రు, పాలకుర్తి ప్రభుత్వ ఆసుపత్రుల ఉన్నతీకరణపై మంత్రి దయాకర్‌రావు ప్రస్తావిస్తూ మంత్రి హరీశ్‌రావుకు లేఖలను అందజేశారు. మహబూబాబాద్ జిల్లా నుంచి ఖమ్మం సభకు పెద్ద ఎత్తున తరలి వచ్చేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని మంత్రులు దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్ పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, డోర్నకల్, సత్తుపల్లి ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యానాయక్, సండ్ర వెంకటవీరయ్య, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్‌రావు, నాయకులు నూకల నరేశ్‌రెడ్డి, సాంబారి సమ్మారావు, బీఆర్ఎస్ తొర్రూరు, పెద్దవంగర, రాయపర్తి మండలాల అధ్యక్షులు పసుమర్తి సీతారాములు, ఈదురు ఐలయ్య, జినుగు అనిమిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు రామిని శ్రీనివాస్, ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, జడ్పీటీసీ రంగు కుమార్, రాష్ట్ర ఈజీఎస్ డైరెక్టర్ ఎల్ వెంకటనారాయణగౌడ్, పాలకుర్తి దేవస్థాన కమిటీ చైర్మన్ వీ రామచంద్రయ్యశర్మ, అనుమాండ్ల దేవేందర్‌రెడ్డి, శ్రీరాం సుధీర్ తదితరులు పాల్గొన్నారు.