మహబూబాబాద్(నమస్తే తెలంగాణ)/హనుమకొండ/మడికొండ, అక్టోబర్ 22 :రేవంత్‌రెడ్డి ఒక బ్రోకర్, చీటర్ అని, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజలకు మళ్లీ కష్టాలేనని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. ఆదివారం మంత్రి సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో కలిసి మంత్రి ఎర్రబెల్లి మానుకోటలో, ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి భట్టుపల్లిలో సభాస్థలి, హెలీప్యాడ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలకు పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువయ్యారని ఎద్దేవా చేశారు. ఈ నెల 27న మానుకోట, భట్టుపల్లి(వర్ధన్నపేట సెగ్మెంట్)లో జరుగనున్న ప్రజా ఆశీర్వాద సభలను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. మంత్రి సత్యవతిమాట్లాడుతూ.. మానుకోట రాళ్లకు ఉన్న పౌరుషం కూడా బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు లేదు అని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఒక బ్రోకర్.., చీటర్ అని, ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ సర్వనాశనం ఖాయమని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. ఈ నెల 27న మధ్యా హ్నం 2గంటలకు మహబూబాబాద్‌లో, సాయంత్రం 4గంటలకు హనుమకొండ భట్టుపల్లిలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. కాగా, ఆదివారం మంత్రి సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందుతో కలిసి మంత్రి ఎర్రబెల్లి జిల్లా కేంద్రంలో, ఎమ్మెల్యే అరూరి రమేశ్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్‌రావుతో కలిసి భట్టుపల్లిలో సభాస్థలి, హెలిప్యాడ్ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఆయా సమావేశాల్లో ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి అన్ని పార్టీలను ముంచుతూ వస్తున్నాడని, ఇప్పుడు కాంగ్రెస్ వంతు వచ్చిందన్నారు. ఈ 27న మహబూబాబాద్‌లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభకు సుమారు 70వేల మంది ప్రజలు తరలిరానున్నట్లు వివరించారు. రాహుల్‌గాంధీ సభలకు ప్రజలు రావ డం లేదు కాబట్టే రోడ్ షోలు పెట్టి కాలం వెళ్లదీస్తున్నారని అన్నారు. సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలాలు అందజేసిన గొప్ప నేత మన సీఎం కేసీఆర్ అని, బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను రాష్ట్ర ప్రజలందరూ స్వాగతిస్తున్న ట్లు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక అవరోధాలు సృష్టించినా రాష్ట్ర ప్రగతిని ఆపని మహా నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని, బీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
డివిజన్ కేంద్రం మానుకోటను జిల్లాగా మార్చి అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. కలెక్టరేట్, మెడికల్ కాలేజీ, ఇంజినీరింగ్ కాలే జీ, హార్ట్టికల్చరల్ డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేసి ఎడ్యుకేషనల్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు నమ్మకం పోయిందని, కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఒక్కచాన్స్ అంటూ ప్రజలను ముందుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. మేడారం జాతరను జాతీయ పండుగగా బీజేపీ ఎందుకు గుర్తించలేదని ఎర్రబెల్లి ప్రశ్నించారు. తండాలను గ్రామ పంచాయతీలుగా ఎందుకు మార్చలేదని, గిరిజన రిజర్వేషన్‌ను 10శాతానికి ఎందుకు పెంచలేదని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రె స్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు మళ్లీ కష్టాలు తప్పవన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట లు తుపాకీ వెంకట్రాముడి ప్రగల్బాల్లా ఉన్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను కర్ణాటకలో కాపీకొట్టినా అమలు చేయలేక పోతున్నారన్నారు. వర్ధన్నపేట నియోజక వర్గ ప్రజా ఆశీర్వా ద సభకు లక్ష మంది ప్రజలు హాజరవుతారని పేర్కొన్నారు.
వర్ధన్నపేట బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్‌ను మరోసారి భారీ మెజారిటీతో ప్రజలు ఆశీర్వదించాలని మంత్రి కోరారు. తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ.. మహబూబాబాద్ జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన గొప్పనాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. ఆయనను ముడోసారి ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు పట్టుదలతో ఉన్నట్లు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలకు ఇంకా అభ్యర్థులు దొరకడం లేద ని, ఆ పార్టీ అభ్యర్థులను ఢిల్లీ నాయకులే డిసైడ్ చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి నెలకొందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు మానుకోట రాళ్లకున్న పౌరుషం లేదన్నారు. ప్రజల కష్టసుఖాలు తెలిసిన బీఆర్ఎస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్‌నాయక్‌ను మరోసారి ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. 27 న మహబూబాబాద్‌లో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయంతం చేయాలన్నారు. సమావేశంలో బీరెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఫరీద్, గద్దె రవి, మార్నేని రఘు, మార్నేని కిరణ్, పర్కాల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.