(శాస్ర్తుల విశ్వనాథ శర్మ శత జయంతి ఉత్సవాల సందర్భంగా)
ఆది శంకరులు స్థాపించిన చతురామ్నాయ పీఠాల్లో ఆస్థాన విద్వాంసునిగా అఖండ భారతదేశంలోనే అరుదైన గౌరవాన్ని పొందిన వేద శాస్త్ర పండితుడు శాస్త్రుల విశ్వనాథ శర్మ. శృంగేరి పీఠంలో, దేశంలోని అన్ని ప్రధాన శంకరమఠాల్లోనూ వాక్యార్థ మహాసభల్లో పాల్గొని తన సంస్కృత భాష వాగ్విలాసంతో శంకరాచార్యుల ప్రశంసలను అందుకున్న విద్వాంసుడాయన.
ఆయుర్వేదంలో ఆచార్య పట్టా పొంది వైద్యాచార్యులుగా సుప్రసిద్ధుడైన విశ్వనాథ శర్మ సంస్కృతాంధ్ర భాషల్లో ఏకకాలంలో అవధానాలు చేసిన సాహిత్య శిరోమణి. వేదాంత శాస్ర్తాన్ని ఔపోసన పట్టిన మానవతావాది. పోరాట గరిమ కలిగి సామాజికవేత్తగాను గుర్తింపు పొందిన చైతన్యశీలి.
1970లో వేద విద్యాపీఠాన్ని స్థాపించి తెలంగాణ ప్రాంతంలో ఎందరికో వేద శాస్ర్తాలను ఆయన బోధించారు. 1982లో తన స్వగ్రామమైన మెదక్ జిల్లా శివంపేటలో శంకరాద్వైత సంస్కృత పాఠశాలను స్థాపించి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి అధిక సంఖ్యలో విద్యార్థులు ఓరియంటల్ బీఏ పరీక్షలో పట్టా పొంది ప్రభుత్వ ఉపాధ్యాయులు అయ్యేందుకు కృషి చేసిన మహామనీషి శాస్త్రుల విశ్వనాథ శర్మ.
ఆయన విశేష సాహితీ సృజనను పరిశీలిస్తే.. శ్రీ వనదుర్గా సుప్రభాతమ్, రాజోపచారా పూజా కల్ప, ఏడుపాయలు వనదుర్గా గరుడ గంగా మహత్మ్యం, భేద సంహితా చారిత్రాకానుశీలనమ్, రాజమానసోల్లాసం, పౌరోహిత్య మీమాంస, విశ్వ సంస్కృత శతాబ్ది గ్రంథః ఆంధ్రరాజ్య విభాగః మొదలైనవి ప్రధానంగా కనిపిస్తాయి.
ఇలాంటి మహామనిషి జన్మించి ఈ విశ్వావసు నామ సంవత్సరం ఫాల్గుణ బహుళ పంచమి (08-03-2026) నాటికి నూరు సంవత్సరాలు ముగుస్తున్నందున ఈ యేడు ఆయన శిష్య, ప్రశిష్యగణం ఆయన శతజయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బహుముఖీనతలోని మహోన్నత పార్శ్వాన్ని తలపోయడం సాహిత్యకారులుగా విధిగా నిర్వర్తించాల్సిన కర్తవ్యం.
1967లో గజారోహణం, 1985లో కనకాభిషేక సత్కారాలను పొంది, అభినవ విద్యారణ్య బిరుదు పొందిన శాస్త్రుల విశ్వనాథ శర్మ చరిత్రకారుడిగా చేసిన కృషి అసాధారణం. ఆనాటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి పిలుపు మేరకు 1973లో సంస్కృత భాషలో ‘విశ్వసంస్కృత శతాబ్ద గ్రంథః ఆంధ్ర రాజ్య విభాగః‘ అనే ఉద్గ్రంథాన్ని వెలువరించి అప్పటి ప్రధాని నుంచి బహుమతి అందుకున్నారు. ఇది ఉమ్మడి తెలుగు రాష్ర్టాల స్వరూపాన్ని కండ్ల ముందు నిలిపి సమగ్ర చరిత్రను అందించిన సార్వజనీన గ్రంథం.
నేటి ఉమ్మడి తెలుగు రాష్ర్టాల భౌగోళిక పరిస్థితులు వాటి ప్రభావం, జనాభా, ఆనాటి ప్రభుత్వ పాలన, జీవన విధానం, సంప్రదాయాలు, క్రీడలు, వినోదాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు సంబంధించిన సమగ్ర చరిత్ర ఇందులో గ్రంథస్థం చేసి ఉన్నాయి. కవిత్రయం మొదలుకొని పూర్వ ప్రబంధ కాలం నుండి 20వ శతాబ్దపు బూర్గుల రామకృష్ణారావు వరకు సాహిత్య సేవను అందించిన వందలాది మంది సంస్కృత, తెలుగు కవులు, రచయితలు విశేష సాహిత్య కృషి, విశేషాలతో ఈ గ్రంథం సుసంపన్నమైనది. వీరితోపాటు అద్వితీయంగా సాహిత్యాన్ని ప్రోత్సహించి పోషించిన స్థానాలు సంస్థానాధీశుల చరిత్రలు పెద్ద సంఖ్యలో కనబడి విస్మయపరుస్తాయి. పరిశోధనాత్మక శాసనవాఙ్మయానికి, సంస్కృత సాహిత్యానికి కూడా ఉన్నతమైన స్థానాన్ని కల్పించడం ఈ గ్రంథ సమగ్రతను చాటుతున్నది. సంస్కృతంలో రచించిన ‘విశ్వ సంస్కృత శతాబ్ద గ్రంథః ఆంధ్ర రాజ్య విభాగః’ అనే ఈ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించి జనబాహుళ్యానికి చేరువ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తెలంగాణ ప్రాంతానికే తలమానికమైన శాస్త్రుల విశ్వనాథ శర్మ వేద విజ్ఞానానికి, సాహిత్య, ఆధ్యాత్మికతలకు ఆయన కుమారుడు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ తండ్రికి వారసుడిగా కొనసాగుతూ శివ్వంపేట గ్రామ ఖ్యాతిని నిలబెట్టి నలుదిశలా విస్తరింపజేయడం ఎంతో హర్షించదగినది.
-డా. కాచాపురం దుర్గాదేవి
78930 93495