కేసముద్రం/ఇనుగుర్తి/నెల్లికుదురు/మహబూబాబాద్ రూరల్/గంగారం/బయ్యారం, సెప్టెంబర్ 2 : రెండు రోజులుగా కురిసిన వర్షానికి వరద బారిన పడిన మహబూబాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క సోమవారం పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆమెకు పలు చోట్ల నిరసనలు, నిలదీతలు ఎదురయ్యాయి.కేసముద్రం మండల కేంద్రంలోని కట్ట తండా తమ ప్రాంతానికి రావాలని, సమస్యలను పరిశీలించాలని కోరారు.
అయినప్పటికీ మంత్రి వెళ్లిపోతుండడంతో భూక్యా నీలమ్మ, ఆంగోత్ ప్రసన్ననాయక్, భూక్యా అమ్మి, ధరావత్ తార, శోభ మార్కెట్కు వెళ్లే ప్రధాన రహదారి పైకి వచ్చి మంత్రి కాన్వాయికి అడ్డుతగిలారు. పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి వారిని బలవంతంగా పక్కకు నెట్టివేయడంతో కాన్వాయి వెళ్లిపోయింది. ఈ సందర్భంగా కట్టతండా వాసులు మాట్లాడుతూ భారీ వర్షాలతో వరద తమ ఇండ్లలోకి వచ్చి బియ్యం, నిత్యావసర వస్తువులు, బట్టలు తడిచిపోయాయని, కనీసం ఇంట్లో ఉండటానికి కూడా వీలు లేకపోవడంతో ఆరు బయట ఉంటున్నామని ఆవేదన వ్య క్తం చేశారు.
ఇదే క్రమంలో బయ్యారం మం డలం అల్లిగూడెం గ్రామానికి సీతక్క వెళ్లగా, స్థానిక రైతు కోడి మల్లేశ్ ఆమె వద్దకు వచ్చి ‘రెండు రోజులుగా కురిసిన వర్షానికి వరి పంట కొట్టుకుపోయింది.. నష్టం వచ్చింది.. దండం పెడతా ఆదుకోండి’ అంటూ వేడుకున్నాడు. వారం క్రితమే ఐదెకరాల్లో వరి పంట వేశానని, వరదతో తీవ్ర నష్టం వాటిల్లిందంటూ కన్నీరు పెట్టుకున్నాడు. బాధ పడొద్దని రైతుకు ధైర్యం చెప్పిన సీతక్క పంట నష్టాన్ని అంచనా వేయాలని తహసీల్దార్ విజయను ఆదేశించారు.
రెండు రోజులుగా కురిసిన వర్షాలకు ఇళ్లల్లోకి నీళ్లొచ్చి, ఇండ్లు కూలిపోయి నిరాశ్రయులైన వారు అధైర్య పడొద్దని, ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క భరోసా కల్పించారు. సోమవారం మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం, ఇనుగుర్తి, నెల్లికుదురు, మహబూబాబాద్, గంగారం, బయ్యారం మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆమె స్థానిక ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యేలు డాక్టర్ భూక్యా మురళీనాయక్, కోరం కనకయ్య, కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్తో కలిసి పర్యటించారు.
కేసముద్రం, ఇనుగుర్తి, గంగారం మండల కేంద్రాలు, నెల్లికుదురు మండలం రావిరాల గ్రామం, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీలను సందర్శించారు. వరద బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. కూలిన ఇళ్లను, తడిసిన నిత్యావసర సరుకులు, తెగిన చెరువులు, వరదలో కొట్టుకపోయిన మూగజీవాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి బాధితులతో మాట్లాడారు. ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. పశువులు, ద్విచక్ర వాహనం, ట్రాక్టర్, ఆటోలు కొట్టుకుపోయిన వారికి అండగా ఉంటామన్నారు. జిల్లాలో పంట నష్టాన్ని అంచనా వేయాలని, యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తక్షణమే తెగిన చెరువులు, రోడ్ల మరమ్మతు చేపట్టాలన్నారు. ఆమె వెంట రెవెన్యూ, పోలీసు, ఇతర శాఖల అధికారులున్నారు.
తాడ్వాయి, సెప్టెంబర్ 2 : తాడ్వాయి మండలం ఎల్బాక, పడిగాపురం, నార్లాపురం గ్రామాల మధ్య ఉన్న జంపన్నవాగుపై హైలెవల్ వంతెన నిర్మించాలని సోమవారం గ్రామస్తులు వాగు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఏటా వర్షాకాలంలో తమ గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుంటున్నాయని, ఏదైనా సమస్య వచ్చినా, ఆరోగ్యం బాగా లేక దవాఖానకు వెళ్లాలన్నా, నిత్యావసరాలు తెచ్చుకోవాలన్నా చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.