గిరిజన సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే మేడారం మినీ జాతర ప్రారంభమైంది. కోరిన కోర్కెలు తీర్చుతూ భక్తుల కొంగు బంగారంగా కొలువబడే సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు భక్తుల రాక మొదలైంది. ఆసియాలోనే రెండో అతిపెద్దది.. తెలంగాణ కుంభమేళాగా పిలువబడే మేడారం మహాజాతర ప్రతీ రెండేళ్లకోసారి కోట్లాది మంది భక్తులతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇది ముగిసిన ఏడాది తర్వాత జరుపుకొనే మినీ జాతర బుధవారం అమ్మవార్ల ప్రధాన పూజారుల ప్రత్యేక పూజలు, మండెమెలిగే కార్యక్రమంతో మొదలు కాగా.. తన్మయత్వంతో భక్తులు తరలివచ్చి తల్లులకు బంగారం మొక్కులు సమర్పిస్తున్నారు. కాగా, ఈ జాతర శనివారం వరకు కొనసాగనున్నది.
– తాడ్వాయి, ఫిబ్రవరి 12
మేడారం సమ్మక్క, సారలమ్మల మినీ జాతర బుధవారం ప్రారంభమైంది. ఆదివాసీ గిరిజన దైవాలకు పూజారులు అత్యంత నియమనిష్టలతో పూజలు నిర్వహించి మండెమెలిగే పండుగను నిర్వహించడంతో జాతర మొదలైంది. మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని మేడారంలోని సమ్మక్క పూజామందిరంలో సిద్ధబోయిన వంశస్తులు, కన్నెపల్లిలోని సారలమ్మ మందిరంలో కాక వంశీయులు ప్రత్యేక పూజలు చేశారు. మొదట అమ్మవార్ల మందిరాలను సిద్ధబోయిన, కాక వంశీయులు నీటితో శుద్ధి చేశారు. గత మహాజాతర అనంతరం భద్రపరిచిన సమ్మక్క, సారలమ్మల పూజా సామగ్రిని ప్రధాన పూజారులు కొక్కెర కృష్ణయ్య, కాక సారయ్య బయటకు తీసి పూజా కార్యక్రమాలకు సిద్ధం చేశారు. పూజారి సిద్ధబోయిన లక్ష్మణ్‌రావు ఇంటి నుంచి మామిడి తోరణాలు, పసుపు, కుంకుమతో పాటు పూజా సామగ్రిని తీసుకొని డోలివాయిద్యాల నడుమ గ్రామ శివారులోని పోచమ్మ ఆలయానికి చేరుకొని పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి బొడ్రాయి వద్దకు చేరుకొని ప్రతిమలను శుద్ధి చేసి పూజలు నిర్వహించారు. గ్రామంలోకి ఎలాంటి దుష్టశక్తులు రాకుండా ఉండేందుకు ఊరి ప్రారంభంలో, తల్లుల గద్దెల ఎదురుగా మామిడి తోరణాలతో పాటు కోడిపిల్లను కట్టి ధ్వజ స్తంభాలను ఏర్పాటు చేశారు. ఊరట్టంలోని చర్ప వంశీయులు, కీర్తిశేషులు మాజీ ఎమ్మెల్యే భోజారావు కుటుంబ సభ్యులు, వారి కూతుళ్లు, అల్లుళ్లు కలిసి చలపెయ్యను బహూకరించగా సిద్ధబోయిన వంశస్తులు స్వీకరించి డోలివాయిద్యాల నడుమ గద్దెల వద్దకు తీసుకొచ్చి పూ జలు చేశారు. అనంతరం అమ్మవార్ల మందిరాల్లో సిద్ధబోయిన, కాక వం శీయులు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. నాలుగు రోజుల పాటు అమ్మవార్లకు పూ జారులు, వారి కుటుంబాలు పూజలు నిర్వహించనున్నారు.
కోరిన కోర్కెలు తీర్చాలంటూ వరాల తల్లు లు మేడారం సమ్మక్క-సారలమ్మల చెంతకు భక్తులు తన్మయత్వంతో చేరుకుంటున్నారు. బుధవారం మినీ జాతర ప్రారంభం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ఎత్తు బంగారం (బెల్లం) సమర్పిస్తూ తమ పిల్లా పాపలను చల్లగా చూడాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని అమ్మవార్లను వేడుకుంటూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తూ జంపన్న, నాగులమ్మకు పూజలు చేసిన అనంతరం గద్దెల వద్దకు చేరుకొని తల్లులను దర్శించుకుంటున్నారు. దీంతో గద్దెల పరిసరాలు కిక్కిరిసిపోతున్నాయి. భక్తులు తల్లులకు యాటపోతులు సమర్పిస్తూ జాతర ప్రాంగణం, అటవీ ప్రాంతంలో వంటలు చేసుకొని విందు భోజనాలు ఆరగిస్తున్నారు. మహాజాతరకు మళ్లీ వచ్చి మొక్కులు చెల్లించుకుంటామని వెనుదిరుగుతున్నారు.
ములుగు, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగా ణ): బుధవారం ప్రారంభమైన మినీ జాతరకు భక్తులు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. జాతర ప్రా రంభమయ్యే ముందు రోజు లక్షలాది భక్తులు మేడారం పరిసర ప్రాంతాలకు చేరుకొని గుడారాలు వేసుకుంటారు. కానీ ఈ సారి అవి కనిపించలేదు. గత మినీ జాతర సందర్భంగా సు మారు 10 లక్షల మంది వరకు భక్తులు రాగా, ఇప్పుడు 20 నుంచి 30 వేల మంది మాత్రమే వచ్చారు. జాతర మొదటి రోజు సుమారు 20 లక్షల మంది వరకు వస్తారని అధికారులు వేసిన అంచనా తప్పింది. ప్రభుత్వం ఆర్టీసీ బ స్సుల ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించినప్పటికీ వారు జాతరకు వచ్చేందుకు ఆసక్తి చూపడంలేదు. ప్రస్తుతం ఆర్టీసీ ప్రాంగణం భక్తులు లేక వెలవెలబోతున్నది. జాతర సమయంలో రద్దీ ఉంటుందని నెల రోజుల ముందు నుంచే వచ్చి పోతుండడం, ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళాకు అధిక సంఖ్యలో ప్రజలు తరలివెళ్తుండడం వల్లే భక్తుల రాక తగ్గినట్లు అంచనావేస్తున్నారు. కాగా, మినీ జాతర అరకొర సౌకర్యాల మధ్య కొనసాగుతున్నది. జంపన్నవాగులో చుక్క నీరు లేక భక్తులంతా స్నానఘట్టాల వద్ద ఉన్న నల్లాల కిందనే స్నానాలాచరించారు. వైద్య శిబిరంలో కేవలం వైద్య సిబ్బంది మాత్రమే మందులను పంపిణీ చేశారు. జాతర పరిసరాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు కనిపించలేదు.