కోదాడ, ఫిబ్రవరి 27 : పోలీసు కస్టడీలో మృతి చెందిన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన దళిత యువకుడు కర్ల రాజేశ్ మృతదేహానికి శుక్రవారం హైదరాబాద్ ఎయిమ్స్ వైద్యులు రీపోస్టుమార్టం చేశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల కేసుతో సంబంధంలేని అమాయకుడైన రాజేశ్‌పై పోలీసులు అక్రమంగా కేసులు బనాయించి చిత్రహింసలు పెట్టడంవల్లే కస్టడీలో మృతి చెందాడని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో పాటు దళిత సంఘాలు, బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు చేపట్టిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఎస్సీ జాతీయ కమిషన్ ఆదేశాల మేరకు రాజేశ్ మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం రాజేశ్ కుటుంబాన్ని పరామర్శించి చిలుకూరు ఎస్సైని సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. రాజేశ్ మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించే వరకు మందకృష్ణ మాదిగతోపాటు ఎమ్మార్పీఎస్ నాయకులు ఇక్కడే ఉన్నారు. దోషులకు శిక్ష పడేదాకా ఉద్యమం ఆగదని మందకృష్ణ స్పష్టం చేశారు.