హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ దౌర్జన్యాలపై బీసీల్లో చైతన్యం రావాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ బీసీలకు పిలుపునిచ్చారు. చెరువులను కాపాడేందుకు ప్రయత్నించినందుకు తనపై అనుముల కుటుంబానికి చెందిన పలువురు దాడి చేశారని ఉమ్మడి పాలమూరు జిల్లా మాడ్గుల మండలం గిరికొత్తపల్లికి చెందిన గొలలకొండ శ్రీనివాస్ శుక్రవారం ఇందిరాపార్క్‌లోని ధర్నాచౌక్‌లో దీక్ష చేశారు. బీసీ నేతలు సిరికొండ మధుసూదనాచారి, ఎంపీ ఈటల రాజేందర్, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ మేధావుల ఫోరం చైర్మన్ చిరంజీవులును కలిశారు.
గిరికొత్తపల్లిలో చెరువుల కబ్జా బాగోతాలను వివరిస్తూ శ్రీనివాస్ వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర ఘటన బీసీలను కలచివేసిందని పేర్కొన్నారు. ఈ విషయం సోషల్‌మీడియా ద్వారానే ప్రజలకు తెలిసిందని తెలిపారు. గొలలకొండ శ్రీనివాస్ తనకు జరిగిన అన్యాయం గురించి రెండు నెలల తర్వాత చెప్పుకున్నాడని పేర్కొన్నారు. బీసీల్లోని విద్యావంతులు సోషల్‌మీడియాను వాడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. కాగా, శ్రీనివాస్‌పై జరిగిన దౌర్జన్యాలపై ఇటీవల నమస్తే తెలంగాణ ‘చెరువులను కాపాడితే చంపేస్తారా?’ అనే శీర్షికతో వెలుగులోకి తెచ్చింది.