వరంగల్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ) : పేరుగొప్ప ఊరు దిబ్బలా తయారైంది వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి పరిస్థితి. ఉత్తర తెలంగాణ ప్రజలకు గుండెకాయ వంటి ఈ పెద్దాస్పత్రిని సమస్యల జబ్బు వెంటాడుతున్నది. వైద్యులు, సిబ్బంది, యంత్రాలు అందుబాటులో ఉన్నప్పటికీ కొన్ని విభాగాల్లో నిర్దేశిత టెస్ట్‌లు జరగటం లేదు. మందులు, ఇంజక్షన్లు, వీల్చైర్లు, స్ట్రెచర్ల కొరత వేధిస్తున్నది. ఫలితంగా ఇక్కడ ప్రజలకు ఆశించిన వైద్య సేవలు అందటం లేదు. ఈ ఆస్పత్రి ఓపీ బ్లాక్‌లోని బయోకెమెస్ట్రీ (91) ల్యాబ్‌లో కొన్ని నెలల నుంచి రీనల్ ఫంక్షన్ టెస్ట్ (ఆర్ఎఫ్టీ) పనిచేయటం లేదు.
దీంతో లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్, లివర్ ఫంక్షన్ టెస్ట్ (ఎల్ఎఫ్టీ), ఎల్డీఎల్, వీఎల్‌డీఎల్, ట్రైగ్లిజర్స్, హెచ్‌డీఎల్ తదితర పరీక్షలు ఇక్కడ చేయటం లేదు. కేవలం కొలెస్ట్రాల్ టెస్ట్ మాత్రమే చేస్తున్నారు. ప్రభుత్వం రూ. 15 లక్షలతో ఏర్పాటు చేసిన మిషన్ ఈ ల్యాబ్‌లో ఉంది. ఎమర్జెన్సీ బ్లాక్ 9వ నెంబర్ గదిలోని ఆర్ఎఫ్టీ ల్యాబ్దీ ఇదే దుస్థితి. వైద్య ఆరోగ్యశాఖ నుంచి కెమికల్స్ సరఫరా నిలిచిపోవటంతో ఈ సమస్య తలెత్తింది. దీంతో వైద్యం కోసం ఎంజీఎం దవాఖానకు వస్తున్న ప్రజలు ఆర్థిక భారమైనా తప్పనిసరిగా ప్రైవేట్ ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు.
ఎంజీఎం ఆస్పత్రి కార్డియాలజీ విభాగంలో 2డీ ఎకో టెస్ట్ అందుబాటులో లేకపోవటంతో రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విభాగంలో కార్డియాలజీ డాక్టర్లు ఉన్నప్పటికీ మూడు నెలలుగా టెస్టులు మాత్రం జరగటం లేదు. ఈ టెస్టు కోసం రోగులను అంబులెన్స్‌లో కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)కి పంపుతున్నారు. ఇక్కడే 2డీ ఎకో టెస్ట్ చేస్తే పేషెంట్లకు కేఎంసీకి వెళ్లి రావాల్సిన ఇబ్బందితో పాటు అంబులెన్స్ వాడాల్సిన అవసరం కూడా తప్పుతుంది.
కేటాయింపులు తగ్గటం వల్ల ఎంజీఎం దవాఖానలో ప్రస్తుతం మందులు, ఇంజక్షన్ల కొరత ఏర్పడింది. పేషెంట్లకు వైద్యులు ఆరు లేదా ఏడు రకాల మందులు రాస్తే వీటిలో రెండు నుంచి మూడు రకాల మందులు లభించటం లేదు. దీంతో ప్రైవేటు మెడికల్ షాపుల్లో కొనుగోలు చేస్తున్నారు. ఇంజక్షన్లదీ ఇదే పరిస్థితి. దీనికి తోడు వీల్చైర్లు, స్ట్రెచర్లు కూడా సరిపడా లేవు. కొన్ని సందర్భాల్లో అటెండెంట్లు రోగులను బెడ్స్ వద్దకు మోసుకెళ్తున్నారు. ఒక పేషెంట్‌ను వీల్‌చైర్ లేదా స్ట్రెచర్‌పై వార్డుల్లోకి తీసుకెళ్తే వాటిని తిరిగి తీసుకొచ్చే వరకు వేచి చూడాల్సి వస్తున్నది.
ఎంజీఎం దవాఖానలోని ఎమర్జెన్సీ బ్లాక్ ఇరుకుగా ఉండటం వల్ల పేషెంట్లు, అటెండెంట్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎమర్జెన్సీ బ్లాక్‌లోని క్యాజువాలిటీ సరిపోక కిటకిటాలాడుతున్నది. ఎమర్జెన్సీ బ్లాక్‌లో ప్రస్తుతం ఒకే ఎక్స్‌రే యంత్రం ఉండగా, ఇది పనిచేయని సమయంలో రోగులను ఓపీ బ్లాక్ వద్దకు తీసుకెళ్లాల్సి వస్తున్నది. ఓపీ బ్లాక్‌లో రద్దీ ఎక్కువగా ఉండే పలుచోట్ల భవనం పైకప్పు పెచ్చులూడి పడటం పేషెంట్లు, వైద్యులు, సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తున్నది. ఆస్పత్రి, ఆవరణలో గతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఎక్కడ ఏమి జరుగుతుందో పరిశీలించే, పర్యవేక్షించే పరిస్థితి లేదు. కాగా, ఈ ఆస్పత్రిలో ఔట్‌సోర్సింగ్‌పై పనిచేస్తున్న పారామెడికల్ సిబ్బందికి కొన్ని నెలల నుంచి వేతనాలు అందలేదు. ఆఫీస్ స్టాఫ్ సహా సుమారు 140 మందికిపైగా ఇక్కడ పారామెడికల్ సిబ్బంది పనిచేస్తున్నారు.