తాడ్వాయి, ఫిబ్రవరి 5 : మేడారం సమ్మక్క-సారలమ్మ పూజారులు బుధవారం గుడిమెలిగే పండుగ నిర్వహించనున్నారు. మహా జాతరకు రెండు వారాల ముందు ఈ పండు గ చేస్తారు. పూజారుల కుటుంబాలు ఇళ్లను శుద్ధి చేసుకొని సమ్మక్క గుడి వద్దకు చేరుకుంటారు. అత్యంత నియమ నిష్టలతో డోలివాయిద్యాల నడుమ సమీప అటవీ ప్రాంతానికి వెళ్లి గుట్ట గడ్డిని సేకరించి గుడిపై కప్పుతారు. అనంతరం గుడిలోని తల్లి గద్దెను ఎర్రమట్టితో అలుకు పూసి రంగురంగుల ముగ్గు లు వేసి అందంగా అలంకరిస్తారు. గుడిమెలిగే పండుగతో అమ్మవార్ల మహా జాతర ప్రారంభమైనట్లు పూజారులు భావిస్తారు.
అప్పటి నుంచి సమ్మక్క-సారలమ్మ పూజారులు అత్యంత నియమనిష్టలు పాటిస్తారు. అనంతరం వచ్చే బుధవారం రోజున తిరిగి సమ్మక్క గుడిలో మండమెలిగే పండుగను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవార్ల పూజా సామగ్రిని శుద్ధి చేసి పూజలు ప్రారంభిస్తారు. మళ్లీ వచ్చే బుధవారం నుంచి మహా జాతరను ప్రారంభిస్తారు. జాతర అనంతరం వచ్చే బుధవారం పూజారులు తిరుగువారం పండుగను నిర్వహించి అమ్మవారి పూజా సామగ్రిని శుద్ధిచేసి తిరిగి గుడిలో భద్రపరుస్తారు. దీంతో మహాజాతర ముగిసినట్లు పూజారులు ప్రకటిస్తారు.