ములుగు, జనవరి 23(నమస్తేతెలంగాణ) : మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ఫిబ్రవరి 1 నుంచి 4వ తేదీ వరకు జరిగే జాతరకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయా శాఖల అధికారులను కోరా రు. సోమవారం సత్యవతిరాథోడ్ ములుగు జిల్లాలో పర్యటించారు. ముందుగా గట్టమ్మ దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోవిందరావుపేట మండలం చల్వాయిలో నిర్వహిస్తున్న కంటి వెలుగు వైద్య శిబిరాన్ని పరిశీలించారు. అనంతరం మేడారం గ్రామానికి చేరుకొని సమ్మక్క-సారలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ పూజారులు గిరిజన సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. మంత్రి అమ్మవార్లకు పసుపు, కుంకుమ, చీరె సారెలను సమర్పించి సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల పేరున ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న కేసీఆర్‌కు తల్లుల దీవెనలు ఉండాలని మొక్కులు చెల్లించారు. అనంతరం జంపన్నవాగు, పరిసర ప్రాంతాలతో పాటు జాతరకు వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేసిన వసతి గృహాలైన పగిడిద్దరాజు భవన్, గోవిందరాజు భవన్‌ను సత్యవతి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఐటీడీఏ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధ్యక్షతన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి జాతర ఏర్పాట్లపై మాట్లాడారు.
రూ.3 కోట్ల 10 లక్షలతో అభివృద్ధి పనులు
ప్రతి సంవత్సరం మేడారం జాతరకు హాజరయ్యే భక్తుల సంఖ్య పెరుగుతున్నదని, ఫిబ్రవరిలో జరిగే మినీ మేడారం జాతరకు 4 లక్షల నుంచి 5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్ల 10 లక్షలతో అభివృద్ధి పనులు పూర్తి చేసిందన్నారు. జాతర సమీపిస్తున్న నేపథ్యంలో పరిసరాల పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్లను శుభ్రం చేయడం, స్నానగదులు, జాతర పరిసర ప్రాంతాల్లో శానిటైజ్ చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించామని అన్నారు. కొండాయి, ఐలాపూర్, బయ్యక్కపేటలో జరిగే మినీ జాతరలకు సౌకర్యాలు కల్పించాలని కోరారు.
జాతర పరిధిలో ఉన్న మేకలు, కోళ్ల దుకాణదారులతో సమావేశాలు నిర్వహించి వ్యర్థాలను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ అధికారులను ఆమె ఆదేశించారు. జడ్పీచైర్మన్ కుసుమ జగదీశ్వర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌కు గత రెండు జాతరలను విజయవంతం చేసిన అనుభవం ఉందని, మినీ జాతరను విజయవంతానికి అధికారులతో సమన్వయం చేస్తూ పర్యవేక్షించాలని కోరారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో అంకిత్, డీఆర్వో కూతాటి రమాదేవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవింద్‌నాయక్, సర్పంచ్ బాబురావు, ఎంపీపీ వాణిశ్రీ, ఈవో రాజేందర్, పూజారులు జగ్గారావు, అధికారులు పాల్గొన్నారు.