హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 18: మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరలో సేవాభావంతో విధులు నిర్వర్తించి, భక్తులకు రవాణా పరంగా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు. వరంగల్ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ (జడ్ఎస్టీసీ)లో ఆదివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి మేడారం జాతరలో విధులు నిర్వర్తించేందుకు వచ్చినవారితో ఆర్టీసీ సన్నద్ధత సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సజ్జనార్ మాట్లాడుతూ జాతరలో సిబ్బంది కేటాయించిన స్థానాల్లో మాత్రమే విధులు నిర్వర్తించాలని సూచించారు. భక్తులకు నిస్వార్థమైన సేవలందించి, సంస్థకు మంచి పేరు తీసుకురావాలని చెప్పారు. మేడారం జాతరకు మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఉంటుందని, సిబ్బంది చాలెంజ్‌గా తీసుకుని విజయవంతం చేయాలన్నారు.
జీరో ఫెయిల్యూర్స్, యాక్సిడెంట్ ఫ్రీగా జాతర జరిగేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సిబ్బంది భక్తులతో మర్యాదపూర్వకంగా మెలగాలని సూచించారు. జాతరలో 15వేల మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని, వారికి వసతి సౌకర్యం, భోజన విషయంలో రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు. మేడారం జాతరలో విధులు నిర్వర్తించే ఆర్టీసీ సిబ్బంది కోసం యూనియన్ బ్యాంకు సహకారంతో రూపొందించిన టీషర్ట్లను ఆవిష్కరించారు. ఆర్టీసీ సీవోవో డాక్టర్ రవీందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వరావు, ఈడీలు మునిశేఖర్, కృష్ణకాంత్, వెంకటేశ్వర్లు, రఘునాథరావు, ఆర్ఎం శ్రీలత పాల్గొన్నారు.