కేంద్ర బడ్జెట్లో ఉమ్మడి వరంగల్‌కు మరోసారి అన్యాయం జరిగింది. పదేండ్లు దాటినా ఏపీ పునర్విభజన చట్టంలోని హామీలను నెరవేర్చడంలో మోదీ సర్కారు మళ్లీ అదే నిర్లక్ష్యం ప్రదర్శించింది. ముఖ్యంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు అంశాన్ని ఎప్పటిలాగే ఈ ఏడాది బడ్జెట్లోనూ పక్కనపెట్టింది. అలాగే ఉమ్మడి జిల్లాలో కీలకమైన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, గ్రేటర్ వరంగల్‌లోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్మార్ట్‌సిటీ పథకం, మామునూరు ఎయిర్పోర్ట్.. ఇలా అన్నింటా మోసమే చేసింది. సహజ వనరులు పుష్కలంగా ఉన్నా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుతో వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లోని యువతకు ఉపాధిపై భరోసా ఉంటుంది. ఈ విషయంలో కేంద్రం ఏండ్లుగా ఈ విషయంపై దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నది. అలాగే మేడారం జాతరకు జాతీయ హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా కేంద్రం పట్టించుకోకపోగా జాతరకు ప్రత్యేక నిధుల కేటాయింపులపైనా స్పష్టత ఇవ్వలేదు.
– వరంగల్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
గిరిజన వర్సిటీకి నిధులు లేవు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగా స్పదించింది. ఏడాది క్రితం గిరిజన యూనిర్సిటీ ఏర్పాటును మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 360 ఎకరాలను యూనివర్సిటీ కోసం అప్పగించింది. రూ.890 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. నిధులను విడుదల చేయకపోవడంతో యూనివర్సిటీకి అవసరమైన భవనాలు, ఇతర వసతుల కల్పన ముందుకు సాగడం లేదు. తాజా బడ్జెట్లోనూ తదుపరి నిధుల విడుదలపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
ముందుకుసాగని ఎయిర్‌పోర్టు ప్రక్రియ
రాష్ట్రంలో రెండో ఎయిర్‌పోర్టును వరంగల్ జిల్లా మామునూరులో ఏర్పాటు చేసే ప్రతిపాదన అంశం ఏండ్లుగా నెమ్మదిగా సాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను మొదలుపెడుతున్నట్లు ప్రకటించినా ఈ పనులు ముందుకు సాగడంలేదు. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ విమానాశ్రయం కోసం నిధులు కేటాయించలేదు. రెండు ప్రభుత్వాల తాత్సారంతో మామునూరు ఎయిర్‌పోర్టు అభివృద్ధిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
టెక్స్టైల్ పార్కును పట్టించుకోలే
దేశంలోనే అతి పెద్ద టెక్స్టైల్ పార్కును కేసీఆర్ ప్రభుత్వం వరంగల్ జిల్లాలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు పేరుతో చేపట్టింది. మౌలిక వసతులను అభివృద్ధి చేయడంతో ఇప్పటికే పలు కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. పీఎం మిత్ర(ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరల్) పథకంలో టెక్స్టైల్ పార్కును చేర్చే విషయంలో ఇప్పటికీ అస్పష్టత ఉన్నది. కేంద్రం ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయలను గ్రాంటుగా ఇవ్వాల్సి ఉన్నా నిధులు మంజూరు చేయడం లేదు. నిబంధనలు, మార్గదర్శకాల పేరుతో నిధులపై తేల్చడం లేదు. రాష్ట్రంలోని లోక్‌సభ సభ్యులు ఈ విషయంపై ఒత్తిడి తేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను బడ్జెట్లో పట్టించుకోలేదు.
అతీగతీ లేని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరంగా ఉన్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రేనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్నది. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 1500 కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక పారిశుద్ధ్య నిర్వహణ అ ధ్వాన్నంగా ఉంటున్నది. అన్ని కాలాల్లోనూ వరంగల్ నగరంలో దోమల తీవ్రత ఎక్కువ. దీంతో వ్యాధులు విజృంభిస్తున్నాయి. గ్రేటర్ వరంగల్‌ను సరికొత్తగా మార్చే అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.4, 170 కోట్లను నవంబర్ 18న కేటాయించింది. ఇప్పటికీ ఈ ప్రాజెక్టు పనులు మొదలు కాలేదు. పనులను పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్రా న్ని కోరింది. బడ్జెట్లో గ్రేట ర్ వరంగల్ ప్రస్తావన ఎక్కడా కనిపించలేదు.
పన్ను చెల్లింపుదారులకు ఊరట
పోచమ్మమైదాన్, ఫిబ్రవరి 1 : ఆదాయపు పన్ను పరిమితిని రూ.12లక్షలకు పెంచడం వ్యక్తిగత ప న్న చెల్లింపుదారులకు, ముఖ్యంగా మధ్యతరగతికి చెందిన వేతనజీవులకు ఉపశమనం. వ్యవసాయరంగంలో పప్పు ధాన్యాల ఉత్పత్తి, నీటిపారుదల, రైతు సంక్షేమంపై దృష్టిసారించి, వ్యవసాయానికి అధిక నిధులు కేటాయించారు. ఆరోగ్య సంరక్షణ కోసం జాతీయ ఆరోగ్య మిషన్ విస్తరణకు ప్రభు త్వం నిధులను కేటాయించి, సామాన్యులకు ఆరోగ్య సేవలను అందుబాటులో తీసుకొచ్చే అవకాశం కల్పించారు. పదవీ విరమణ ఉద్యోగులు పొదుపు చేసేలా ప్రోత్సహించారు. సీనియర్ సిటిజన్స్‌కు డిపాజిట్ వడ్డీపై టీడీఎస్ మినహాయించి, ప్రస్తుతం ఉన్న రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు పెంచడం వారికి ఎంతో ఊరట కలిగించింది. – పీవీ నారాయణరావు, ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్
రైల్వే డివిజన్ రాలేదు
దేశంలోనే కీలక జంక్షన్‌గా ఉన్న కాజీపేటలో డివిజన్ ప్రతిపాదనను కేంద్రం పట్టించుకోలేదు. కోచ్ ఫ్యాక్టరీ విషయంలోనూ ఇలాగే జరిగింది. 2023 జూలై 8న కాజీపేటలోని 160 ఎకరాల్లో రైల్వే వ్యాగన్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ భూమిపూజ చేశా రు. రూ.521 కోట్లతో ఈ పనులు జరుగుతున్నా యి. రైల్వే బోర్డు సెప్టెంబర్ 9న వ్యాగన్ ఫ్యాక్టరీని కోచ్ ఫ్యాక్టరీగా అప్‌గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నది. అప్‌గ్రేడ్ చేసిన కోచ్ ఫ్యాక్టరీలో ఎల్‌హెచ్ బీ, ఈఎంయూ కోచ్‌లను తయారీ యూనిట్‌ను అభివృద్ధి చేసేలా రైల్వే బోర్డు ప్రణాళిక రూపొందించింది. ఈ నేపథ్యంలో కాజీపేట డివిజన్ ఏర్పాటుపై స్పష్టత వస్తుందని జిల్లా ప్రజలు ఆశించారు. కానీ కేంద్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
రామగుండం, భూపాలపల్లి, మేడారం, ఏటూరునాగారం, మణుగూరు మార్గంలో 207 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణం కోసం రూ.4,10 0 కోట్లు, కాజీపేట(నష్కల్)-కరీంనగర్ మధ్య 62 కిలోమీటర్ల రైల్వే మార్గానికి రూ.464 కోట్లు, డోర్నకల్-మిర్యాలగూడ మధ్య 105 కిలోమీటర్ల రైల్వే మార్గానికి రూ.2,100 కోట్లు, డోర్నకల్-గద్వాల మధ్య 296 కిలోమీటర్ల రైల్వే మార్గానికి రూ.5వేల కోట్లు, కాజీపేట-భూపాలపల్లి మధ్య 64 కిలోమీటర్ల రైల్వే మార్గానికి రూ.1,152 కోట్లతో ప్రతిపాదనలకు కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపుపైనా అస్పష్టత నెలకొన్నది.
తెలంగాణపై వివక్షే..
హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 1 : రూ.50.6 లక్షల కోట్లతో ది పవర్ ఆఫ్ రైజింగ్ మిడిల్ క్లాస్ పేరుతో జీరో పావర్టీ లక్ష్యంగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ మధ్యతరగతి ప్రజలను సంతోషపెట్టే విధంగా ఉంది. ఆదాయ పన్ను పరిమితులను పెంచడం స్లాబ్స్ మార్చడం స్ట్రీట్ వరర్స్కి క్రెడిట్ కార్డులు కోటి మంది గిగ్ కార్మికులకు ఆరోగ్య బీమా సదుపాయం, కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా సన్న, చిన్నకారు రైతులకు రుణ పరిమితి పెంపు చిన్న పరిశ్రమలకు క్రెడిట్ గ్యారెంటీ మధ్యతరగతిని సంతోషపెట్టే చర్యలే. రైతులకు పెట్టుబడి సహాయం పెంచకపోవడం వ్యవసాయ గ్రామీణ విద్య, ఆరోగ్యరంగాలకు పెద్దగా కేటాయింపులు పెరగకపోవడం.. ఉ పాధి హామీ పథకానికి పీఎం ఆవాస్ యోజనకు నిధులు పెంచకపోవడం అసంతృప్తి కలిగించే అంశాలే. మరొకసారి కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ప్రస్తావన లేకపోవ డం విభజన చట్టంలో పొందుపరిచిన హామీలపై రాష్ట్ర ప్రతిపాదనలను కూడా పరిగణలోకి తీసుకోకపోవడం తెలంగాణపై వివక్షగానే భావించాలి. కేంద్ర బడ్జెట్ ఒక సాదాసీదా బడ్జెట్‌గానే కనిపిస్తుంది. – డాక్టర్ తిరునహరి శేషు, అర్థశాస్త్ర అధ్యాపకులు, కేయూ
సంతులిత, వృద్ధి-ఆధారిత బడ్జెట్
హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 1 : బడ్జెట్లో ఆర్థిక వృద్ధి, మధ్యతరగతి ప్రజలకు పన్ను ఉపశమనం, వ్యాపార ప్రోత్సాంపై దృష్టిసారించింది. ప్రధానంగా 12 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు, మూలధన వ్యయం పెంపు, ఎంఎస్ఎంఈ అండ్ స్టార్టప్‌లకు మద్దతు, బీమా రంగంలో ఎఫ్‌డీఐ సంస్కరణలు ఉన్నాయి. ఏఐ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఏఐ విద్యకోసం రూ.500 కోట్ల నిధులు, దేశం ఏఐ టాలెంట్ హబ్‌గా మారేందుకు సహకారం, ఆర్థిక స్థిరత్వం వ్యయ నియంత్రణ, ఆర్థిక లోటు నిర్వహణ, లక్ష కోట్ల మేర ప్రత్యక్ష పన్నుల్లో ఆదాయ నష్టం, ఇది తీవ్రంగా ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేయవచ్చు. పన్ను తగ్గింపును ప్రైవేటీకరణ, జీఎస్టీ కలెక్షన్ల ద్వారా సమతుల్యం చేయాల్సిన అవసరం ఉంది. కార్పొరేట్ పన్ను తగ్గింపులు లేవు, ఇది భారత వ్యాపారాలను అంతర్జాతీయంగా పోటీదారుల కంటే వెనుకబడుతుంది. వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి.. రైతులకు కొత్త పథకాలు, రుణమాఫీ లేదా ఎంఎస్పీ పెంపుపై ఎలాంటి ప్రకటనలేదు, ఇది రైతుల సంఘాలను నిరాశపర్చవచ్చు.
– తిప్పర్తి రాఘవరెడ్డి, సీనియర్ ఛార్టెర్డ్ అకౌంటెంటెంట్