తాడ్వాయి, ఫిబ్రవరి 7 : మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు అడుగుపడింది. సమ్మక్క-సారలమ్మ పూజారులు జాతర నిర్వహణపై ఆరు నెలల క్రితం నిశ్చయించగా బుధవారం గుడిమెలిగే పండుగతో అమ్మవార్లకు పూజలు ప్రారంభమయ్యాయి. మేడారంలోని సమ్మక్క పూజామందిరంలో, కన్నెపల్లిలోని సారలమ్మ దేవాలయంలో సిద్దబోయిన, కాక వంశీయులు ప్రత్యేక పూజలు ఆరంభించారు. వేకువజామున నిద్రలేచి మొదట ఇళ్లను శుద్ధి చేసుకున్న తర్వాత నూతన వస్ర్తాలు ధరించి ఆయా గ్రామాల్లో పూజారులు, వంశీయులు ఆలయాలకు చేరుకున్నారు. తొలుత మందిరాలను, ఆ తర్వాత తల్లుల ప్రతిరూపాలైన గద్దెలను నీటితో శుద్ధి చేసి శుభ్రం చేశారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో డోలివాయిద్యాల నడుమ సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లి గుట్ట గడ్డిని సేకరించుకుని తల్లుల గద్దెల వద్ద భద్రపరిచారు.
సమ్మక్క ప్రధాన పూజారి సిద్దబోయిన మునీందర్ ఇంటి నుంచి మామిడి తోరణాలు, పసుపు, కుంకుమ, పూజా సామగ్రిని తీసుకొని డోలివాయిద్యాల నడుమ ఆలయాలకు చేరుకున్నారు. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి గద్దెల వద్దకు పూజాసామగ్రిని చేర్చి సేకరించిన గుట్ట గడ్డిని మందిరాలపై వేశారు. పూజారుల ఆడపడుచులు తల్లి గద్దెకు మట్టితో అలుకు పూతలు చేసిన తర్వాత రంగులతో గద్దెను అందంగా అలంకరించారు. సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర క్రిష్ణయ్య ఆధ్వర్యంలో గత జాతర పూర్తయిన తర్వాత భద్రపరిచిన తల్లి పూజా సామగ్రిని బయటకు తీసి శుద్ధి చేశారు. ఈ సందర్భంగా పూజారులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు తల్లి గద్దెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తల్లికి యాటపోతును సమర్పించి మహాజాతర ప్రారంభానికి తొలి పూజలు ఘనంగా నిర్వహించారు. కన్నెపల్లిలోని సారలమ్మ పూజామందిరంలో ప్రధాన పూజారి కాక సారయ్య, కిరణ్ అమ్మవారి పూజాసామగ్రిని శుద్ధి చేసి తల్లి రూపంలో ఉన్న అడేరాలను శుద్ధి చేసి పసు పు, కుంకుమ చల్లి పూజలు నిర్వహించారు. గుడిమెలిగే పండుగతో అమ్మవార్లకు మొదలైన పూజలు మహాజాతర తర్వాత వచ్చే తిరుగువారం వరకు ప్రతి రోజూ కొనసాగుతాయి. వచ్చే బుధవారం సమ్మక్క-సారలమ్మల మందిరాల్లో మండమెలిగే పండుగను ఘనంగా నిర్వహించి మళ్లీ వచ్చే బుధవారం అమ్మవార్ల మహాజాతర నిర్వహిస్తారు.
కోరిన కోర్కెలు తీర్చే సమ్మక్క-సారక్కల దర్శనం కోసం వచ్చే భక్తులతో మేడారం జనసందోహంగా మారింది. అమ్మవార్ల మహాజాతరకు మరికొద్ది రోజుల సమయం ఉన్నప్పటికీ ముందస్తుగా దర్శించుకునే భక్తుల సంఖ్యరోజురోజుకూ పెరిగిపోతోంది. బుధవారం సుమారు 6లక్షల మంది భక్తులను దర్శించుకున్నట్లు దేవాదాయశాఖ అధికారులు వెల్లడించారు. జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం సమ్మక్క-సారక్క, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెల వద్దకు చేరు కొంటున్నారు. అనంతరం గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతర పరిసరాల్లో ఎటూ నాలుగు కిలోమీటర్ల మేర భక్తులు చెట్ల కింద విడిది చేస్తున్నారు. వంటలు చేసుకుని విందు భోజనాల అనంతరం స్వగ్రామాలకు తిరుగు ప్రయాణం అవుతున్నారు. భక్తుల వాహనాలతో పలు ప్రాంతాలు రద్దీగా మారాయి. జాతర పరిసరాల్లోని పలు రకాల దుకాణాల్లో వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి.