Warangal | ఖిలావరంగల్, ఏప్రిల్ 12 : పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని ఎంసీపీఐయూ బొల్లికుంట గ్రామ కార్యదర్శి చెవ్వ కుమారస్వామి అన్నారు. శనివారం ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట గ్రామంలోని అంబేద్కర్ సెంటర్లో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని గ్రామ పార్టీ ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్లతో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరల వల్ల పేద ప్రజలపై పెనుభారం పడుతుందన్నారు. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం అడ్డూ అదుపు లేకుండా నిత్యావసర వస్తువుల రేట్లు పెంచి దోచుకుంటుందని విమర్శించారు. పెట్టుబడిదారుల కొమ్ముకాస్తు పేద ప్రజల నడ్డి విరుస్తందని ఆవేదన వ్యక్తం చేశారు. ధరలు తగ్గించకపోతే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో దేవర రాజు,బొల్లె ఎల్లయ్య, వీరస్వామి, వెంకటయ్య, లక్ష్మీరావు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.