శాయంపేట, మార్చి 11 : కాంట్రాక్టర్లకు బిల్లులియ్యక చలివాగు ప్రాజెక్టులోకి నెల రోజుల పాటు నీటి పంపింగ్ జరగలేదని, దాంతో నీటి సమస్య తీవ్రమై పంటలు ఎండిపోతున్నాయని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి శివారులోని దేవాదుల పంప్‌హౌస్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్మసాగర్‌కు పంపింగ్ బంద్ చేయాలని డిమాండ్ చేస్త్తూ మంగళవారం భారీ ధర్నా నిర్వహించారు. ముందుగా దేవాదుల సీఈ అశోక్‌కుమార్‌కు ఫోన్ చేసి గండ్ర మాట్లాడారు. చలివాగు ప్రాజెక్ట్‌లో కనీసం 15 అడుగుల నీటిమట్టం ఉంచిన తర్వాతే ధర్మసాగర్‌కు నీటి సరఫరా చేయాలని సూచించారు.
అట్ల కాదని ఇకడి పంట పొలాలను ఎండబెట్టి పైకి నీరు తీసుకెళ్లాలనుకుంటే చూస్తూ ఊరుకోమని, మోటర్లు బంద్ పెడతామని హెచ్చరించారు. ఇక్కడికి ఈఈని పంపించి హామీ ఇప్పించాలని సూచించారు. కొద్ది సేపటికి ఈఈ సునీత వచ్చి ఆరు రోజుల్లో పదిహేను అడుగులకు నీటిని ఉంచుతామని పేర్కొనడంతో ధర్నా విరమించారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ జనవరిలో నెల రోజుల పాటు చలివాగు ప్రాజెక్ట్‌లోకి నీటి పంపిణీ జరగలేదన్నారు. కాంట్రాక్టర్‌కు ఇవ్వాల్సిన రూ.5కోట్ల బిల్లు చెల్లించకపోవడంతో సిబ్బంది జీతాలు ఇవ్వకపోవడంతో ఈ సమస్య ఏర్పడిందన్నారు. పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం కనికరం చూపించడం లేదన్నారు.
చలివాగు ప్రాజెక్టులో ప్రస్తుతం పది అడుగుల నీటిమట్టం మాత్రమే ఉందన్నారు. చలివాగులో నీటి మట్టం 15 అడుగులకు పెరిగే వరకు మోటార్లు బండ్ పెట్టాలని డిమాండ్ చేశారు. రైతుల కష్టాలను చూడలేక ఆందోళన చేపట్టామన్నా రు. స్థానిక ఎమ్మెల్యే అసమర్థత స్పష్టంగా కనిపిస్తుందని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మోటర్లు బంద్ పెట్టి చలివాగు ఆయకట్టు పొలాలకు నీటిని విడుదల చేశామని తెలిపారు. ఇక్కడి పొలాలను ఎండబెడితే ఎకరాకు రూ.50వేల నష్టపరిహారం ఇవ్వాలని, లేకపోతే ప్రభుత్వాన్ని ఎండగడతామని హెచ్చరించారు. వారం రోజుల్లో 15 అడుగులకు నీటిమట్టం ఉంచి పై నీటినే ఎగువకు పంపింగ్ చేయాలని, లేకపోతే రైతు పక్షాన ఉద్యమించి తాళాలు పగులగొట్టయినా మోటర్లు బంద్ చేస్తామని హెచ్చరించారు.
రైతులతో రాజకీయం చేయాల్సిన అవసరం తనకు లేదని, చలివాగు ఆయకట్టులో పొలాలు ఎండకుండా చూడాలన్నదే లక్ష్యమన్నారు. చలివాగు ఆయకట్టు వెంట చిట్యాల, రేగొండ, మొగుళ్లపల్లి, టేకుమట్ల వరకు వరి పంట పొట్ట దశలో ఉందని, అందరూ కూడా రైతులేనని, ఇకడి పరిస్థితి అర్థం చేసుకొని తూము ద్వారా నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని గండ్ర డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ మారెపల్లి నందం, పీఏసీఎస్ వైస్ చైర్మన్ దూదిపాల తిరుపతిరెడ్డి, మేకల శ్రీనివాస్, దైనంపెల్లి సుమన్, గంటా శ్యాంసుందర్‌రెడ్డి, అరికిల్ల ప్రసాద్, కొమ్ముల శివ, గాజె రాజేందర్, శాయంపేట, గోరికొత్తపల్లి, రేగొండ, చిట్యాల, మొగుళ్లపల్లి బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.