Iran War : ఏ రెండు దేశాల మధ్య యుద్ధమైనా.. ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా ఇరువైపులా భారీ నష్టం ఉంటుంది. అందులోనూ యుద్ధం కోసం భారీగా నిధులు ఖర్చు చేయాలి. యుద్ధాల కారణంగా కొన్ని దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి కూడా. ఇప్పుడు ఇదంతా ఎందుకూ అంటే ప్రస్తుతం జరుగుతున్న ఇరాన్ యుద్ధం కోసం అమెరికా భారీగా ఖర్చు పెడుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి అధికారిక సమాచారం బయటకు రాదు.
కానీ, అమెరికాలోని వాషింగ్టన్కు చెందిన సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (సీఎస్ఐఎస్) అనే సంస్థ నివేదిక ప్రకారం అమెరికరా ఈ యుద్ధం కోసం భారీగా ఖర్చు చేస్తోంది. శుక్రవారం నాటికి ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమై వారం రోజులు అవుతోంది. ఇన్ని రోజులు యుద్ధంపై చేసిన ఖర్చుపై అంచనాల్ని ఈ నివేదిక వెల్లడించింది. యుద్ధం మొదలైన మొదటి 100 గంటల్లోనే అమెరికా 3.7 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. అలాగే ఈ వారం రోజులపాటు సగటున రోజుకు 900 మిలియన్ డాలర్లు ఖర్చైంది. అంటే మన కరెన్సీలో రోజుకు రూ.8,300 కోట్ల వరకు ఖర్చవుతోంది. ఇప్పటికే వాడిన ఆయుధాల స్థానంలో కొత్తవి రూపొందించేందుకు భారీగా ఖర్చవుతుంది. అదనంగా 3.1 బిలియన్ డాలర్లు అవసరం. రోజుకు 758 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాల్ని యుద్ధంలో వినియోగిస్తున్నారు.
ఫైటర్ విమానాల కోసం కూడా భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ఖర్చు రక్షణ శాఖకు కేటాయించిన బడ్జెట్‌కు అదనం. అంటే ఈ నిధుల కోసం అమెరికా రక్షణ శాఖ మళ్లీ నిధుల్ని అడగాల్సి ఉంటుంది. దీనికి అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం తెలపాలి. అయితే, ఇది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిపెట్టొచ్చు. అదనంగా నిధులు కోరితే ప్రతిపక్షం వ్యతిరేకించవచ్చు. కానీ, నిధులు లేకపోతే యుద్ధాన్ని కొనసాగించడం కూడా కష్టమవుతుంది. ఇప్పటికే అమెరికా ప్రజల్లో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, చమురు ధరల పెరుగుదల, జీవన వ్యయం పెరగడం వంటి వాటిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలు ట్రంప్‌కు ఇబ్బందిగా మారొచ్చనేది విశ్లేషకుల అంచనా.