జనగామ, మే 21(నమస్తే తెలంగాణ) : రైతులు పండించే ధాన్యానికి మద్దతు ధరకు అదనంగా క్వింటాల్‌కు రూ.500 బోనస్ అంటూ వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పుడు మ్యానిఫెస్టో అంశాలపై మాట మారుస్తున్నదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. మ్యానిఫెస్టోలో భాగంగా వరంగల్‌లో విడుదల చేసిన బుక్లెట్ పేజీ నంబర్ 8లో రైతులకు రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే అంటూ మడత పేచీ పెడుతున్నదని మండిపడ్డారు. మంగళవారం జనగామలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం లో మాట్లాడారు. ధాన్యానికి రూ.2,183 ఉంటే రూ. 2,683, మక్కజొన్నకు రూ.1,870 ఉంటే రూ.2,200, కందులకు రూ.6,300 ఉంటే రూ.6,700 ఇలా ప్రతి పంటకు ఎంత ఇస్తామన్నది కాంగ్రెస్ పార్టీ నమ్మబలికిందన్నారు. రైతు డిక్లేరేషన్‌లో సన్నవడ్లు అని గానీ..
దొడ్డు వడ్లు అని కానీ పేర్కొనలేదని, మొన్న పేపర్లో లీక్ ఇస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధాన్యంపై కాంగ్రెస్ అబద్ధం చెబుతుందని స్పష్టంగా చెప్పారన్నారు. బోనస్‌పై బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేస్తే మీరు అనవసరంగా ఆందోళనలు చేస్తున్నారు.. సీఎం రేవంత్ సన్నవడ్లకే బోన స్ అని అనలేదని, అలాంటి ఉద్దేశం లేదని పీసీసీ వ ర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ మీడి యా సమావేశంలో చెప్పారని గుర్తుచేశారు. అంటే పూట కో మాట మాట్లాడి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు పండించే ధాన్యంపై అసలు అవగాహనే లేదని, రాష్ట్రంలో 3కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండిస్తుంటే ప్రభుత్వం కొనుగోలు చేసేది రెండు సీజన్లకు కోటీ 30నుంచి కోటీ 40లక్షలు సేకరిస్తారన్నారు. కొనేదాంట్లో వచ్చేది 10 నుంచి 20శాతం మాత్రమే సన్నవడ్లు వస్తాయని అన్నా రు. సన్నవడ్లు డిమాండ్ ఉన్న తెలంగాణ సరిహద్దులోని సత్తుపల్లి, వైరా, కోదాడ, మిర్యాలగూడ, కర్నాటక సరిహద్దులోని ఆలంపూర్, గద్వాల సహా మహారాష్ట్ర సరిహద్దులోని బాన్సువాడ, బోధన్ ప్రాంతాల్లోనే వేస్తారన్నారు.
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని వాయిదాలు వేస్తూ, మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామని మాటమార్చి రైతాంగాన్ని వంచిస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావాలంటే ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జనగామ ప్రాంతంలో పంటల దిగుబడి 10 రెట్లు పెరిగిందని, 3లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతున్నదన్నారు. కేసీఆర్ పాలనలోనే కరువు ప్రాంతంగా ఉన్న జనగామ సుభిక్షంగా మారిందన్నారు. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం వరి అధికంగా పండించే జనగామ రైతులకు ఆశనిపాతంలా మారిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే డిసెంబర్ 9న రూ.2లక్షల రుణ మాఫీ ఒకేసారి అవుతుందని ఆశపడ్డారన్నారు. ఆ తర్వాత మాట మార్చి మళ్లీ ఆగస్టు 15 అంటూ హామీ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతు రుణమాఫీ కోసం కార్పొరేషన్ ఏర్పాటు అనేది పెద్ద మోసం అని మండిపడ్డారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి ఓటు వేయాలని పిలుపునిచ్చా రు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, కౌన్సిలర్లు గాడిపెల్లి ప్రేమలతరెడ్డి, తాళ్ల సురేశ్‌రెడ్డి, దేవరాయి ఎల్లయ్య, మారెట్ మాజీ చైర్మన్ బాల్దె సిద్దిలింగం, రైతుబంధు సమితి మాజీ జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పసుల ఏబేల్, గద్దల నర్సింగరావు, బైరగొని యాదగిరిగౌడ్ పాల్గొన్నారు.