నల్లబెల్లి, ఏప్రిల్ 28 : మేడే స్ఫూర్తితో పని గంటల పెంపునకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు కోసం కార్మికులు పోరాటాలకు సిద్ధమవ్వాలని తెలంగాణ ఏఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మూడం మల్లేశం పిలుపునిచ్చారు. కార్మిక వర్గాన్ని కట్టు బానిసత్వానికి గురి చేసే విధంగా ఆర్ఎస్ఎస్, బిజెపి సర్కార్ 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చే విధానానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం 139 వ మే డేను ఘనంగా నిర్వహించాలన్నారు. మండలంలోని భార్గవి ఇండస్ట్రీస్ వద్ద కార్మికుల సమావేశం ఈర్ల రాజు అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ సర్కార్ కార్మికులు అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న 44 రకాల కార్మిక చట్టాలను రద్దుచేస్తూ, పనిగంటలను కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా 12 గంటలుగా మార్చేందుకు లేబర్ కోడ్ లను ముందుకు తెచ్చిందని విమర్శించారు. నాలుగు లేబర్ కోడ్స్ అమలు వల్ల కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారబోతునందున కార్మిక వర్గం ఐక్యంగా ఉండి పోరాడాలని పిలుపు నిచ్చారు. అలాగే వెంటనే ఆపరేషన్ గ్రీన్ హంట్ ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దేశ సరిహద్దులలో ఉంచాల్సిన భద్రత దళాలను ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో ఆదివాసీలు, మావోయిస్టులపై ఉపయోగించడం దుర్మార్గమని విమర్శించారు. సమావేశంలో ప్రశాంత్, పిండి రాజు,ఈర్ల రవి, దేవరాజు, కోమండ్ల రమేష్, వైనాల రవి, జన్ను రవి, తాళ్ల పెళ్లి రవి, సిద్ధ లింగమూర్తి, కోమల శేఖర్, తదితరులు పాల్గొన్నారు.