నర్సంపేట, ఏప్రిల్ 5 : మక్క ధర రోజురోజుకూ తగ్గుతున్నది. ప్రభుత్వం కొనకపోవడం, మద్దతు ధర తక్కువగా ఉండడంతో రైతులు ప్రైవేటుకే విక్రయిస్తున్నారు. నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో రెండు నెలల క్రితం క్వింటాల్‌కు రూ. 2350-2450 ఉండగా, ప్రస్తుతం రూ.200-250 వరకు తగ్గించారు. ఆరు గాలం శ్రమించి పంట తీసుకొస్తే వ్యాపారులు సిండికేటై ధర తగ్గిస్తున్నారని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2200 మాత్రమే ఉండగా, ప్రైవేట్ వ్యాపారులు రెండు నెలల క్రితం రూ. 2350 నుంచి రూ. 2450 ధర పెట్టి కొనుగోలు చేశారు. వారం రోజులుగా మద్దతు ధరకు మించి కొనడం లేదు. ప్రభుత్వ కొనుగోలుకు 4,5 రోజుల ప్రాసెస్ (ఆరబెట్టడం, తూర్పార బట్టడం, గన్నీ సంచులు నింపడం, టోకెన్లు, సీరియల్ నంబర్లు తదితర సమస్యలు) ఉంటుండడంతో అటువైపుగా రైతులు దృష్టి సారించడం లేదు.
ప్రస్తుతం ప్రైవేట్ వ్యాపారులు ఏదో ఒక కూటుకు క్వింటాల్‌కు రూ. 2188 ధర చెల్లించి, మిగిలిన అన్నింటికి క్వింటాల్‌కు రూ. 2156లు చెల్లిస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నర్సంపేట నియోజకవర్గంలో ఈసారి 56,150 ఎకరాల్లో మక్కజొన్న పంట సాగు చేయగా, నెక్కొండ మండలంలో 13,450 ఎకరాలు, చెన్నారావుపేటలో 11,380, దుగ్గొండిలో 10,890, నల్లబెల్లిలో 9,880, నర్సంపేటలో 7,500, ఖానాపురం మండలంలో 3,050 ఎకరాల్లో రైతులు మక్కజొన్న పంట వేశారు.
తేమ పేరుతో వ్యాపారులు రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. 14-15 శాతం కంటే ఎక్కువ మాయిశ్చరైజ్ వస్తేనే మక్కలను కొంటున్నారు. దీంతో రోజల తరబడి మక్కలను ఆరబోసేందుకు అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. మార్కెట్లో సరైన సౌకర్యాలు లేక అష్టక ష్టాలు పడుతున్నట్లు చెబుతున్నారు.
నేను మూడెకరాల్లో మక్కజొన్న సాగు చేశాను. మార్కెట్లో ప్రైవేట్ వ్యాపారులు మక్కలకు సరిగా రేటు పెట్టడం లేదు. ఏదో ఒక రాశికి కొంత రేటు పెట్టి మిగిలినవన్నీ తక్కువ ధరలకే కొంటున్నారు. మద్దతు ధర కూడా రావడం లేదు. రెండు నెలల ముందు మక్కలు చేతికి వస్తే ధరలు అనుకూలించేవి. ప్రస్తుతం ధర తగ్గింది.
– రాపాక మల్లయ్య, రైతు, అశోక్‌నగర్, ఖానాపురం
మక్కజొన్న సాగుకు ఖర్చులు బాగా పెరిగాయి. ఎకరం మక్కలు మిషన్ పట్టడానికి రూ. 2500, ఇరిసిన, ఎత్తిన కూలీ రూ.400 నుంచి రూ.450లు, మార్కెట్‌కు తరలించేందుకు రూ. 3 వేల వరకు ఖర్చులయ్యాయి. తీరా ప్రైవేటు వ్యాపారులు సరిగ్గా ధరలు పెట్టకపోవడంతో నష్టం జరుగుతోంది. వ్యాపారులు మద్దతు ధరకు మించి కొనుగోలు చేస్తే కొంత వరకు కలిసొచ్చేది.
– అల్లి శివ, రైతు, గురిజాల, నర్సంపేట మండలం