ఒకవైపు అనారోగ్య సమస్య.. మరోవైపు సామాజిక అభద్రత… రెండింటి నడుమ నలిగిపోతూ కాలం వెళ్లదీస్తున్న హెచ్ఐవీ బాధితుల పట్ల మానవీయ కోణంలో స్పందించాల్సిన తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలోనే బాధ్యతారాహిత్యం రాజ్యమేలుతున్నది. సొసైటీలోని సిబ్బంది నిర్లక్ష్యమో.. అవగాహన లోపమో.. కారణమేదైనా బాధితులకు మరిన్ని కష్టాలను తెచ్చి పెడుతున్నది. బాధితులు తాము వెళ్లే ఏఆర్టీ సెంటర్లలో వైద్య సేవల్లోని ఇబ్బందులు, సమస్యలపై సొసైటీకి ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కారం కావడం దేవుడెరుగు! ఆయా సెంటర్ల సిబ్బంది బాధితులను మరిన్ని వేధింపులకు గురిచేసే పరిస్థితులను తెచ్చిపెడుతున్నది. ఫిర్యాదుదారుడి గుర్తింపు గోప్యంగా ఉంచాలనే కనీస సోయి లేకుండా సొసైటీ సిబ్బంది వ్యవహరిస్తుండటంతో కొందరు బాధితులు మరిన్ని కష్టాలు అనుభవిస్తుండగా… మరికొందరు ఆ కష్టాలను భరించలేక ఏకంగా వైద్య సేవలకు దూరమవుతున్న ఆందోళన పరిస్థితులు నెలకొంటున్నాయి.
సిటీబ్యూరో, (నమస్తే తెలంగాణ): హెచ్ఐవీ రోగులకు తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, ఏఆర్టీ సెంటర్లలోని కొందరు సిబ్బంది తీరు శాపంగా మారుతున్నది. కేవలం హెచ్ఐవీ రోగుల ప్రాణాలే కాకుండా సమాజ ఆరోగ్యంతో ముడిపడి ఉన్న హెచ్ఐవీ/ఎయిడ్స్ నియంత్రణకు సంబంధించిన శాఖను సాధారణంగా ఐఏఎస్ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రోగుల ఆరోగ్య పరస్థితి, వారికి కావల్సిన మందులు, సామాజిక భద్రత కల్పించడం, కౌన్సిలింగ్ ఇప్పించడం, తదితర అన్నిరకాల బాధ్యతలను ఈ శాఖ పర్యవేక్షిస్తుంది. అందుకు కావాల్సిన నిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమకూరుతాయి. అదే సమయంలో హెచ్ఐవీ వ్యాప్తి చెందకుండా అవసరమైన నియంత్రణ చర్యలు, వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం తదితర అంశాలను సైతం ఈ శాఖనే పర్యవేక్షిస్తుంది. కానీ గత కొంత కాలంగా తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీకి పీడీ లేకపోవడంతో ఆ శాఖ గాడితప్పుతున్నది. దీంతో హెచ్ఐవీ రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఫిర్యాదు చేస్తే అంతే….
ఏవైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయడానికి తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ‘1097’అనే టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులో ఉంచింది. గతంలో అయితే ఎవరైన రోగులు తమ సమస్యలపై ఫిర్యాదు చేస్తే వెంటనే టీజీ సాక్స్‌లోని అధికారులు స్పంధించి తగిన చర్యలు తీసుకునేవారు. రోగులను ఇబ్బందులకు గురిచేసే వారిపై చర్యలు తీసుకునేవారు. రోగులకు సంబంధించిన ఎలాంటి వివరాలను కూడా బయటకు లీక్ చేయకుండా గోప్యంగా ఉంచేవారు.
కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఎవరెం చేసినా.. అడిగే నాథుడు లేకపోవడంతో ఫిర్యాదు చేసిన హెచ్ఐవీ రోగుల వివరాలు లీకవుతున్నట్లు బాధితులు వాపోతున్నారు. ముఖ్యంగా రోగులు చికిత్స తీసుకునే ఏఆర్టీ సెంటర్లలో ఎదురయ్యే సమస్యలపై టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి, ఫిర్యాదు చేస్తే, ఫిర్యాదు చేసిన రోగుల వివరాలను అక్కడి సిబ్బంది తిరిగి సంబంధిత ఏఆర్టీ సెంటర్లో రోగులను ఇబ్బందులకు గురిచేసే సిబ్బందికే చేరవేస్తున్నట్లు బాధిత రోగులు ఆరోపిస్తున్నారు.
ఎవరికీ చెప్పుకోలేక..
ఫిర్యాదు చేసిన రోగుల వివరాలు తెలుసుకున్న సంబంధిత సిబ్బంది వారిని లక్ష్యంగా చేసుకుని వివిధ రకాలుగా వేధింపులకు గురిచేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఉస్మానియా, గాంధీ ఏఆర్టి సెంటర్లలో నెలకొన్న సమస్యలపై ఫిర్యాదు చేసినప్పుడు టోల్‌ఫ్రీ సిబ్బంది తిరిగి తమ వివరాలను ఆ సెంటర్ల సిబ్బందికి చేరవేస్తున్నట్లు ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు.