NTR | యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన భుజానికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైంది. హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో బుధవారం ఎన్టీఆర్‌కు ఆర్థోస్కోపిక్ సర్జరీ నిర్వహించినట్లు ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ ద్వారా వెల్లడించాయి. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది. సర్జరీ అనంతరం ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. అయితే భుజం పూర్తిగా కోలుకోవడానికి సుమారు రెండు నుంచి మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. ఈ సమయంలో తారక్ పూర్తిగా విశ్రాంతి తీసుకోవడంతో పాటు వైద్యుల సూచనల మేరకు రిహాబిలిటేషన్, ఫిజియోథెరపీ వంటి ప్రక్రియలను కొనసాగించాల్సి ఉంటుంది.
ఇక సర్జరీ అనంతరం జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా తన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులకు అప్డేట్ ఇచ్చారు. తాను క్షేమంగా ఉన్నానని, అభిమానులు చూపిస్తున్న ప్రేమ, ప్రార్థనలు తనకు ఎంతో బలాన్ని ఇస్తున్నాయని తెలిపారు. ఎన్టీఆర్ తన పోస్ట్‌లో.. “మీరందరూ చూపించిన ప్రేమ, అందించిన ప్రార్థనలకు నా మనసు నిండిపోయింది. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. నేను క్షేమంగా ఉన్నాను” అంటూ అభిమానులకు భరోసా ఇచ్చారు. అలాగే తనకు చికిత్స అందించిన కిమ్స్ ఆసుపత్రి వైద్య బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తనకు వైద్యం అందించిన అద్భుతమైన వైద్య బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
తన స్నేహితులు, కుటుంబ సభ్యులు, అభిమానులు అందిస్తున్న మద్దతు తనకు ఎంతో బలాన్ని ఇస్తోందని ఎన్టీఆర్ పేర్కొన్నారు. తన ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ పోస్ట్ ద్వారా తాను బాగానే ఉన్నానని స్పష్టం చేశారు. చివర్లో “త్వరలోనే కలుద్దాం” అంటూ అభిమానులకు హామీ ఇవ్వడంతో ఆయన అభిమానుల్లో ఆనందం నెలకొంది. సర్జరీ విజయవంతంగా పూర్తైందన్న వార్తతో పాటు ఎన్టీఆర్ స్వయంగా హెల్త్ అప్డేట్ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ పూర్తిగా కోలుకునే వరకు వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు. భుజానికి సంబంధించిన గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి రెండు నుంచి మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉండటంతో, ఆయన తదుపరి సినిమా షూటింగ్ షెడ్యూల్స్‌పై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.