కాశీబుగ్గ, ఏప్రిల్ 30: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని అపరాల యార్డులో మక్క రైతులకు తిప్పలు తప్పడం లేదు. మద్దతు ధరతో మార్క్‌ఫెడ్‌కు అమ్ముకుందామని మార్కెట్‌కు వస్తే.. 20 రోజులైనా కొనడం లేదని వాపోతున్నారు. మరికొందరు మాత్రం కాంటాలు నిర్వహించి పది రోజులైనా బస్తాలను గోదాముకు తరలించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎనుమాముల మార్కెట్లో ఖిలావరంగల్ పీఏసీఎస్ సీఈవో ఆధ్వర్యంలో కొనుగోళ్లు చేస్తుండగా, నిర్వాహకులు తమకు నచ్చిన వారి మక్కలనే కొంటున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.
తమ సరుకును కొనుగోలు చేయడానికి ఎంపికైన తర్వాతే గన్నీ సంచులు ఇచ్చేందుకు 10 రోజులకు పైగా జాప్యం చేసినట్లు తెలిపారు. మక్కలు అమ్మిన తర్వాత కూడా పది రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నట్లు పలువురు రైతులు తెలిపారు. వేలిముద్ర, ట్రక్‌షీట్ కోసం వేచి ఉండాల్సి వస్తున్నదంటున్నారు. మార్కెట్ పరిధిలో సుమారు 30 వేల బస్తాలు కొనుగోలు చేసి పది రోజులైందని, వాటిని తరలించిన తర్వాతే కాంటాలు పెడతామంటున్నారని రైతులు వాపోతున్నారు. డబ్బులు ఇచ్చిన వారి బస్తాలను కాంట్రాక్టర్ తరలిస్తున్నట్లు పలువురు రైతులు మార్కెట్ అధికారులకు ఫిర్యాదు చేశారు.