నర్సింహులపేట, మార్చి 11 : మండలంలో భూగర్భ జలాలు తగ్గడం, బావులు, బోర్లలో నీళ్లు ఇంకి పోవడంతో చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయి. ఇది చాలదన్నట్టు కరెంటు(Current) కష్టాలు సైతం రైతులను వెంబడిస్తున్నాయి. పేరుకు24 గంటల నిరంతర కరెంటు ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ సాయంత్రం ఐదు అయితే కరెంటు కట్ అవుతుంది. రాత్రి 11 గంటల తర్వాత రైతులు మోటర్లు పెట్టేందుకు తిప్పలు పడుతున్నారు. లో వోల్టేజ్ కారణంగా కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ పాలనలో గుండెలపై చెయ్యేసుకొని కంటి నిండా నిద్రపోయిన రైతులకు ఇప్పుడు కునుకు కరువైంది.
రాష్ట్రంలో సమైక్య పాలన నాటి విద్యుత్తు కష్టాలు పునరావృతమవుతున్నాయి.
పొలానికి నీళ్లు పెట్టేందుకు కరెంటు కోసం అర్ధరాత్రి పడిగాపులు మొదలయ్యాయని రైతులు ఆరోపిస్తున్నారు. కాగా, పెద్దనాగారం స్టేజ్ గ్రామానికి చెందిన అల్లిపురపు రవీందర్ రెడ్డి సొంత ఖర్చులతో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశాడు. దీంతో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓవైపు భూగర్భ జలాలు అడుగంటి, మరోవైపు చాలీచాలని కరెంటుతో పంటలకు నీళ్లందక ఎండిపోతుంటే.. నాణ్యతలేని ట్రాన్స్ఫార్మర్లతో కాలిపోతున్నాయని రైతులు మండిపడుతున్నారు. అలాగే ఎండలు ముదరకముందే అప్రకటిత కొతలు మొదలయ్యాయి. దీంతో రైతులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓవర్ వోల్టేజ్ పేరుతో మధ్యాహ్నం సమయంలో గంట నుండి రెండు గంటల వరకు కరెంటు తీసేస్తున్నారు. లో వోల్టేజీ కారణంగా, మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించి రైతుల మోటర్లు కాలిపోకుండా సహకరించాలని రైతులు కోరుతున్నారు.