మహాదేవపూర్, మార్చి 7: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఉద్యకారుల సంఘం డిమాండ్ చేసింది. హామీలు నెరవేర్చి ఉద్యమకారుల బంధువుగా మారాలని పేర్కొంది. ఈ మేరకు మహబూబాద్ (Mahabubabad) జిల్లా మహాదేవపూర్‌లోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుల సంఘం నాయకులు సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్‌కార్డులు రాశారు. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, 250 గజాల ఇంటి స్థలం, రూ.25 వేల పెన్షన్ అమలు చేయాలన్నారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి రూ.10 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధికార ప్రతినిధి ఎండీ అయుబుద్దిన్, ఉద్యమకారులు మేసినేని వెంకటేశ్వరరావు, పేరాల కేశవరావు, కొరిపెల్లి ప్రశాంత్ రావు, మేసినేని గోపాల్ రావు, ఠాకూర్ రమేష్ సింగ్, కొరిపెల్లి రామకృష్ణ, మేసినేని దేవేందర్, కొరిపెల్లి కృష్ణారావు, పిడుగు సమ్మయ్య పిడుగు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమకారుల పోస్టుకార్డు ఉద్యమం
ఎన్నికలకు ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ పోస్టు కార్డు ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం అమరవీరుల స్థూపం వద్ద పోస్టుకార్డుపై సంతకాలు చేసి సీఎం రేవంత్‌రెడ్డికి పోస్టు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కేవీ కృష్ణారావు మాట్లాడుతూ ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల స్థలం, రూ.25 వేల పెన్షన్, గృహ నిర్మాణం కోసం రూ.10 లక్షల నగదు వెం టనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.