నర్సింహులపేట ఫిబ్రవరి 25 : అక్రమ ఇసుక(Illegal sand )రవాణాను అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తహశీల్దార్ నాగరాజు తెలిపారు. మంగళవారం మండలంలోని కౌసల్యదేవిపల్లి ఆకేరువాగు వద్ద ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ నర్సింహులపేట మండలంలోని కౌసల్యదేవిపల్లి, రామన్నగూడెం, జయపురం, కొమ్ములవంచ బొజ్జన్నపేట గ్రామాల శివారులోని ఆకేరు వాగు నుండి అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రతిరోజు చెక్ పోస్ట్ వద్ద సిబ్బందితో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. రాత్రి వేళలో ఇబ్బందులు తలెత్తకుండా టార్చ్ లైట్లు అందించామన్నారు. వాగుల నుంచి ఇసుక రవాణా చేసేందుకు ఎలాంటి అనుమతులు లేవని నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీలు ఆర్ఐ అఖిల్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.