ఢిల్లీ : రికార్డు స్థాయిలో దేశానికి మూడో ఐసీసీ టీ20 ప్రపంచకప్పును అందించిన టీమ్ఇండియాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ నజరానా ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టుకు రూ. 131 కోట్ల నగదు బహుమతిని అందజేయనున్నట్టు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇది 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా రోహిత్ సేనకు ఇచ్చిన (రూ. 125 కోట్లు) నజరానా కంటే రూ. 6 కోట్లు అధికం.
కాగా ఈ క్యాష్ రివార్డులో అత్యధిక భాగం క్రికెటర్లకే దక్కనున్నది. ఒక్కో క్రికెటర్‌కు రూ. 6 కోట్లు (15 మందికి రూ. 90 కోట్లు) పోను మిగిలిన రూ. 41 కోట్లను సహాయక బృందానికి అందనున్నట్టు బోర్డు వర్గాల సమాచారం. క్యాష్ ప్రైజ్ ప్రకటన సందర్భంగా ఆటగాళ్లకు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన బీసీసీఐ సెక్రటరీ దేవ్జిత్ సైకియా.. భవిష్యత్‌లోనూ ఈ జైత్రయాత్రను కొనసాగించాలని ఆకాంక్షించాడు.