‘నాకు పర్సనల్‌గా ప్రేమకథలంటే చాలా ఇష్టం. కోవిడ్ తర్వాత లవ్‌స్టోరీస్ తగ్గిపోతుంటే బాధపడ్డాను. మళ్లీ ఇప్పుడు ట్రెండ్ మొదలైంది. ‘చెన్నై లవ్‌స్టోరీ’తో మరో కల్ట్ లవ్‌స్టోరీ ఇండస్ట్రీకి దక్కింది’ అన్నారు హీరో నాగచైతన్య. మంగళవారం జరిగిన ‘చెన్నై లవ్‌స్టోరీ’ సక్సెస్మీట్కు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. కిరణ్ అబ్బవరం, శ్రీగౌరిప్రియ జంటగా నటించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించగా.. ఎస్కేఎన్, సాయిరాజేష్ నిర్మించారు.
ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ.. ఈ సినిమాలో తాను కోరుకునే ప్రేమకథను చూశానని, ఎంతో పరిణితితో రాసిన స్టోరీ ఇదని, పోస్టర్ మీద కలెక్షన్స్ నెంబర్స్ వేయడం కంటే ఇదే నిజమైన విజయంగా భావిస్తానని చెప్పారు. ఈ సినిమాలోని ఎమోషన్స్‌తో పాటు క్యారెక్టర్స్‌కు ప్రతీ ఒక్కరూ కనెక్ట్ అవుతున్నారని, నాగచైతన్యను చూస్తే తన మంచికోరే అన్నలా అనిపిస్తారని కిరణ్ అబ్బవరం ఆనందం వ్యక్తం చేశారు.
నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ ‘నాలుగు రోజుల్లోనే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయింది. మూడురోజుల్లో 40.1కోట్ల రూపాయల వసూళ్లు దక్కాయి. బ్లాక్‌బస్టర్ కాదు..అంతకుమించి సక్సెస్ సాధించింది’ అన్నారు. సోమవారం వసూళ్లు చూశాక ఈ సినిమాను ప్రేక్షకులు ప్రేమిస్తున్నారని అర్థమైందని నిర్మాత, చిత్ర రచయిత సాయిరాజేష్ సంతోషం వ్యక్తం చేశారు. తనకు నిజమైన కెరీర్‌ని ఇచ్చిన చిత్రమిదని, ప్రేక్షకులు ఇంతటి ప్రేమను చూపిస్తారని అస్సలు ఊహించలేదని కథానాయిక శ్రీగౌరిప్రియ పేర్కొన్నది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.