నర్సింహులపేట, అక్టోబర్ 30: మొంథా తుఫాను ప్రభావంతో మహబూబాబాద్ (Mahabubabad) జిల్లాలో వర్షాలు దంచికొట్టాయి. ఎడతెరపి లేకుండా రెండు రోజులపాటు కురిసిన భారీ వానలకు నర్సింహులపేట (Narsimhulapet) మండలంలో వరి, పత్తి పంట దెబ్బతిన్నది. వర్షపు నీటిలో పంట నీట మునగడంతో వరి ఎన్నులు నీటీలో తెలడుతున్నాయి. పత్తి తడిసి
మొలకలొచ్చాయి. నీటితో పంటలకు ప్రమాదమని, ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉంటే వరి కుళ్లితుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని కౌసల్య దేవిపల్లి శివారు ఆకేరు బ్రిడ్జిపై నీరు ప్రవహిస్తుండడంతో పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. కొమ్ములవంచ వద్ద కొత్త చెరువు మత్తడి నీరు, ఆకేరు వాగు బ్యాక్ వాటర్ రావడంతో నెల్లికుదురు మండలాని వెళ్లే దారిలో ఉన్న లో లెవెల్ బిడ్జిపై నీరు ప్రవహిస్తున్నది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. పకీర తండా గ్రామపంచాయతీ పరిధిలోని బుడ్డతండాలో వరద నీరు ఇండ్లలోకి చేరింది.




దంతాలపల్లి మండలంలోని ఎడతెరిపి లేని వానకు వరి పంట నీట నీటమునిగింది. పత్తి , మిరప పంటలో నీరు నిలవడంతో మొక్కలు చనిపోయాయి. పాలేరు వాగు ఉధృతితో పెద్ద ముప్పారం గ్రామం వద్ద లోయర్ బ్రిడ్జి నుంచి నీరు ప్రవహిస్తున్నది. దీంతో రెండు రోజులుగా గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసి ముద్దవ్వడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.



