బయ్యారం, జూలై 20: కాకతీయ రాజులచే నిర్మించబడి ఎంతో ప్రాచుర్యం కలిగిన బయ్యారం పెద్ద చెరువులోకి (Pedda Cheruvu) వరద నీరు చేరుకుంటుంది. గత రెండు రోజులుగా వరంగల్ – ఖమ్మం సరిహద్దు గ్రామాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా.. పంది పంపుల వాగు, మసి వాగులు పొంగిపొర్లడంతో పెద్ద చెరువులోకి వరద నీరు చేరుకుంటుంది. పెద్ద చెరువు గరిష్ట నీటి మట్ట 16.2 అడుగులు కాగా ప్రస్తుతం 11 అడుగులకు నీరు చేరుకుంది. వర్షాలు కురిస్తే మరో ఐదు రోజుల్లో చెరువు అలుగుపారే అవకాశం ఉందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే పెద్ద చెరువు అలుగునీటి ద్వారానే గార్ల మండలం సీతంపేట పెద్ద చెరువు అలుగుపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడి రైతులు బయ్యారం పెద్ద చెరువుకు అలుగు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రతి ఏటా జూన్ మొదటి లేదా రెండో వారంలోనే పెద్ద చెరువు అలుగుపడుతుండగా, ఈ ఏడాది ఆలస్యం అవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. పెద్ద చెరువులోకి నీరు చేరుతుండడంతో సందర్శకుల తాకిని కూడా ప్రారంభమైంది.