నర్సింహులపేట, ఏప్రిల్ 10: నాలుగేండ్ల క్రితం ఉద్యోగం నుంచి తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్‌తో ఉపాధి పనులు చేయిస్తూ కావాలనే తమకు పనులు కల్పించడం లేదంటూ మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని జయపురం గ్రామంలో కూలీలు (NREGA) ధర్నాకు దిగారు. పనులు కల్పించాలని కార్యదర్శిని అడుగుతే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆరోపించారు. గత కొన్ని రోజులుగా గ్రామంలో ఉపాధి పనులు చేస్తున్నప్పటికీ అర్హులైన తమందరికీ పనులు చూపించడంలేదని, కొంత మందికి మాత్రమే పనులు కల్పిస్తున్నారని చెప్పారు. ఉపాధి హామీ చట్టం కింద పని చేసిన తమకు నాలుగు నెలలుగా బకాయిలు చెల్లించాలని, పనులున్న చోట మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
వేసవి ఎండలు తీవ్రంగా ఉన్నందున మెడికల్ కిట్లు, మంచినీరు ఇవ్వాలన్నారు. పని చేసిన 14 రోజులకు కూలి చెల్లించాలని చట్టంలో ఉన్నప్పటికీ ఇంత వరకూ ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. వేసవిలో సక్రమంగా పనులు ఇవ్వకుండా అనేకమంది కూలీలకు గతేడాది వందరోజుల పని పూర్తికాకుండానే పనులు కల్పించడం ఆపేశారని తెలిపారు. ఏప్రిల్ ఒకటి తర్వాత కూడా గ్రామాల్లో సక్రమంగా పనులు కల్పించడంలేదని, వెంటనే జాబ్ కార్డు ఉన్న ప్రతి కూలీకి పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధి పనికి రాకపోతే జాబ్ కార్డులు తొలగిస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారని పనికి వెళ్దామంటే పని కల్పించడం లేదని పని కల్పించని పంచాయతీ కార్యదర్శి పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.