నర్సింహులపేట, ఏప్రిల్ 22: కూలి పనులు కల్పించాలని మహబూబాబాద్ జిల్లా (Mahabubabad) నర్సింహులపేట మండలంలోని పెద్దనాగారం పనిప్రదేశం వద్ద కూలీలు మంగళవారం ధర్నా చేశారు. నెలరోజులుగా పనిచేస్తే రోజుకు రూ.50 నుంచి రూ.100 లోపు డబ్బులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కొంతమందికి కావాలనే ఎక్కువ డబ్బులు వచ్చే విధంగా చేస్తూ తమపై చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. తాము సరిగా పని చేయడం లేదని ఇకపై రావద్దంటూ టెక్నికల్ అసిస్టెంట్ చెబుతున్నారని వెల్లడించారు. గత కొన్ని రోజులుగా గ్రామంలో ఉపాధి పనులు చేస్తున్నప్పటికీ అర్హులైన తామందరికి పనులు కల్పించకుండా కొంత మందికి మాత్రమే పనిస్తున్నారని విమర్శించారు.
పని చేసిన తమకు నాలుగు నెలలుగా బకాయిలు చెల్లించాలని, పనులున్న చోట మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. దళితులమని చిన్నచూపు చూస్తున్నారని పనికిరావద్దని చెప్పినవారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. నెల రోజులు పనికి పోతే రూ.3 వేల నుంచి రూ.5 వేలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 20 వరకు వస్తున్నాయని ఇదేంటని ప్రశ్నించినందుకు పనికిరావద్దని చెప్తున్నారని తెలిపారు. పనికి వెళ్దామంటే పని కల్పించడం లేదని, పని కల్పించని టెక్నికల్ అసిస్టెంట్ పైచర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.