కురవి, ఫిబ్రవరి 26 : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం కురవి మండల కేంద్రంలోని భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారిని దర్శించుకునేందుకు ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు (Mlc Ravinder rao)సతీసమేతంగా విచ్చేశారు. వీఐపీ క్యూ లైన్ నుండి లోపలికి వచ్చే సమయంలో క్యూ లైన్ అప్పటికే నిండి ఉండడంతో కొద్దిసేపు వేచి ఉండాల్సి వచ్చింది. ఎంతకి క్యూ లైన్ కదలక పోవడంతో ఒకానొక దశలో వెను తిరిగి వెళ్లిపోదామా అని ఆలోచించారు. అక్కడే ఉన్న ఆలయ ఈవో సత్యనారాయణ పై వీఐపీ దర్శనం పట్టించుకోకపోతే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అప్రమత్తమైన అధికారులు ఎమ్మెల్సీ దంపతులను మరో గేటు గుండా స్వామి వారిని దర్శనం చేయించి అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడుతూ..జాతర నిర్వహణ సరిగా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికైనా అప్రమత్తం కాకుంటే, రాత్రి జరిగే కళ్యాణోత్సవం మరింత రసాభాసగా మారే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
తాను అనేక సంవత్సరాల నుండి జాతరాకు వస్తున్నానని, భక్తుల ఇంత అసౌకర్యానికి గురవడం, వీఐపీల దర్శనాలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడాన్ని మాత్రం ఇప్పుడే చూస్తానన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి, సంబంధిత శాఖల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెల్తానని ఎమ్మెల్సీరవీందర్ రావు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని సమన్వయంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కోరారు. ఆయన వెంట ఎడ్ల వేణు, అంబరీష, రామకృష్ణ తదితరులు ఉన్నారు.